- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుంతలు తీసి రూ. లక్షలు సంపాదిస్తున్న యువకుడు
దిశ, మహేశ్వరం: అధునాతన పద్ధతులలో వ్యవసాయం చేస్తే రైతులకు అధిక లాభాలు వస్తాయని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రామచంద్రగూడకు చెందిన యువ రైతు అభిలాష్ గౌడ్ అంటున్నాడు. అధునాతన పద్ధతిలో వ్యవసాయం చేస్తూ లాభాలు గడిస్తున్న అభిలాష్ దిశతో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో తాను సాధించిన విజయం గురించి చెప్పుకొచ్చారు. అభిలాష్ గౌడ్ ది వ్యవసాయ కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచి వ్యవసాయం ఆసక్తి ఉండడంతో ఇంటర్మీడియట్ వరకు చదువుకొని, తనకున్న పొలంలోనే వ్యవసాయం చేయడానికి సిద్ధమయ్యాడు.
తనకున్న 10 ఎకరాల పొలంలో నీటి వసతి లేకపోవడంతో గత 7 సంవత్సరాల నుంచి 15 బోర్లు వేసినా, 13 బోర్లలలో ఒక్క చుక్క నీటి బొట్టు కూడా రాలేదు. అయితే, ఒకరోజు గ్రామంలో వ్యవసాయ అధికారులు సమావేశం ఏర్పాటు చేస్తున్నారని తోటి స్నేహితుడు చెప్పడంతో ఆ మీటింగ్ కు హాజరయ్యాడు అభిలాష్. వ్యవసాయం ఏ విధంగా చేయాలి అనే అంశంపై అక్కడ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. తమ పొలంలో 15 బోర్లు వేసినా నీరు రాలేదని అభిలాష్ అధికారులకు తెలిపాడు. అప్పుడు అతనికి బోరు బావి వద్ద ఇంకుడు గుంత తీయాలని అధికారులు సూచించడంతో బోరు బావి వద్ద 20 ఫీట్ల ఇంకుడు గుంత తీశాడు. దీంతో 2 నెలల తర్వాత 3 నుంచి 4 గంటల పాటు బోరు నీళ్లు పోసేది. గత సంవత్సరం వర్షాలు భారీగా పడడంతో ప్రస్తుతం నీటి వసతి పుష్కలంగా ఉందని, ప్రతి రైతు తన బోరు బావి వద్ద ఇంకుడు గుంత తీసుకుంటే రైతులు నీటి సమస్య నుంచి బయటపడొచ్చని తెలిపాడు. ఒక ఇంకుడు గుంతకు సుమారు రూ. 35 వేల వరకు ఖర్చు అవుతుందని తెలిపాడు.
‘గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మీటింగ్ కు వెళ్లడం వల్ల అక్కడ వ్యవసాయ శాస్త్రవేత్త కృష్ణ పరిచయం అయ్యారు. హయత్ నగర్ లో కేవీకేలో 20 రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కృష్ణ గారి సూచన మేరకు ఆ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని వ్యవసాయం ఏ విధంగా చేయాలి అనే అంశం పై శిక్షణ తీసుకున్నాను. ఈ శిక్షణ పూర్తి చేసిన తర్వాత డ్రిప్ ద్వారా ప్రతి నీటి చుక్కను కాపాడుతూ…2 ఎకరాలల్లో బెంగుళూరు నుంచి చామంతి నారును కొనుగోలు చేసి, పంట వేసిన తర్వాత మంచి లాభాలు వచ్చాయి. అనంతరం మంచి నారు కోసం బెంగుళూరు వెళ్లే బదులు మన పొలంలోనే పూల నారు పండిస్తే బాగుంటుందన్న ఆలోచన రావడంతో రూ. 5 లక్షల 50 వేలు ఖర్చు చేసి నర్సరీ కోసం ఫాలీ హౌస్ ఏర్పాటు చేశాను. పొలంలోనే పూల మొక్కల కొమ్మలను కత్తిరించి, సొంతంగా నారు తయారు చేసి రైతులకు అమ్ముతున్నాను. మండలంలోని పలు గ్రామాలతోపాటు ఇతర జిల్లాల నుంచి రైతులు నారుని కొనడానికి వస్తున్నారు. కుటుంబ సభ్యులు వ్యవసాయం వద్దు అని చెప్పినా పట్టుదలతో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చిన సలహాలు, సూచనలతో వ్యవసాయం చేయడం ప్రారంభించాను. నేడు నేను ఉపాధి పొందుతూ… మరో 8 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. నెలకు అన్ని ఖర్చులు పోగా రూ. 80 వేల నుంచి ఒక లక్ష వరకు సంపాదిస్తున్నాను. నేడు యువత వ్యవసాయం రంగంపై దృష్టి పెట్టాలి. వ్యవసాయమంటే వేస్ట్ కాదు కొద్దిగా పట్టుదలతో మారుతున్న కాలానుగుణంగా మార్కెట్ ధరలకు అనుకూలంగా, లాభసాటి పంటలపై దృష్టి పెడితే వ్యవసాయమే బెస్ట్ గా ఉంటుందన్నారు. ప్రభుత్వం గతంలో రైతులకు సబ్సిడీ ద్వారా కలుపుతీత యంత్రాలు, డ్రిప్, ఫాలీ హౌస్ నిర్మాణాలకు సబ్సిడీలు ఇచ్చేవి.. కానీ, నేడు ఇవ్వడం లేదు. సబ్సిడీలు ఇచ్చి యువ రైతులను ప్రోత్సహించాలన్నారు. ఉపాధి హామీ కూలీలను వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తే రైతులకు కూలీల ఖర్చులు తగ్గుతాయి. ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేస్తే రైతు రాజు కావడం ఖాయం. యువకులు వ్యవసాయంపై దృష్టి పెడితే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు ‘ అని అభిలాష్ గౌడ్ తెలిపాడు.