ఆ దేశాల ‘ఆరోగ్య సేతులు’ ఇవే!

by sudharani |
ఆ దేశాల ‘ఆరోగ్య సేతులు’ ఇవే!
X

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం ఆరోగ్య సేతు పేరుతో కాంటాక్ట్ ట్రేసింగ్‌ యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో ప్రపంచంలోని చాలా దేశాలు తమ దేశాలకే ప్రత్యేకంగా ఈ తరహా యాప్‌లను రూపొందించుకున్నాయి. అయితే ఇవి కూడా ఆరోగ్య సేతు యాప్ మాదిరిగానే వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ పలు దేశాల యాప్‌లు మాత్రం మంచి పేరు సంపాదించుకుంటున్నాయి. అవేంటో చూద్దాం!

సింగపూర్: ఈ దేశానికి చెందిన కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ పేరు ‘ట్రేస్‌టుగెదర్’. బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా పనిచేసే ఈ యాప్ ప్రాక్సిమిటీ సమాచారం ఆధారంగా పనిచేస్తుంది. అంటే ఇదే యాప్ ఇన్‌స్టాల్ చేసిన మరో స్మార్ట్‌ఫోన్ దరిదాపుల్లో ఉంటే ఈ యాప్ గుర్తిస్తుంది. అయితే ఎలాంటి జియో-లొకేషన్ డేటాను సేకరించదు. అలాగే వ్యక్తిగత సమాచారం విషయంలో కేవలం ఫోన్ నెంబర్ మాత్రమే అడుగుతుంది. దీని ద్వారా కొవిడ్ 19 పేషెంట్ దరిదాపుల్లో ఉంటే ఆరోగ్యశాఖ నేరుగా కాల్ చేస్తుంది. ముఖ్య విషయం ఏంటంటే, సేకరించిన సమాచారం మొత్తం వినియోగదారుని పరికరంలోనే ఎన్‌క్రిప్టెడ్ రూపంలో భద్రపరిచి ఉంటుంది. ఎలాంటి క్లౌడ్‌కు కానీ, సర్వర్‌కు కానీ నేరుగా అప్‌లోడ్ అవదు.

ఐస్‌ల్యాండ్: అన్ని దేశాల కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్‌లతో పోలిస్తే అత్యధిక యూజర్ పెనిట్రేషన్ ఉన్న యాప్.. ఐస్‌ల్యాండ్‌కు చెందిన ‘రాక్నింగ్ సీ 19’. ఇది బ్లూటూత్ ద్వారా కాకుండా లోకేషన్ డేటా ఆధారంగా పనిచేస్తుంది. అయినప్పటికీ సమాచారం వినియోగదారుని ఫోన్లో మాత్రమే ఉంటుంది తప్ప బయటికి చేరదు. కానీ లొకేషన్ డేటా ఆధారంగా పనిచేస్తున్న కారణంగా ప్రతి గంటకు ఒకసారి ఫోన్ లొకేషన్‌ను సేవ్ చేస్తుంటుంది. ఈ సేవ్ చేసిన డేటాను 14 రోజుల తర్వాత డిలీట్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఈ 14 రోజుల్లో డేటా తప్పుడుదారి పట్టే అవకాశం కూడా ఉందని బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. అయితే బ్లూటూత్ కంటే లొకేషన్ డేటా ఆధారంగా పనిచేసే యాప్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా అధికారులకు కొవిడ్ 19 వ్యాప్తిని సులభంగా ట్రాక్ చేయగల అవకాశం ఉంటుంది.

ఆస్ట్రేలియా: ఏప్రిల్ 26న ‘కొవిడ్‌ సేఫ్’ పేరుతో కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్‌ను ఆస్ట్రేలియా విడుదల చేసింది. తక్కువ కాలంలో ఈ యాప్‌ను 5 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే మనదేశంలో మాదిరిగా తప్పనిసరి చేయకుండా స్వచ్ఛందంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది. యాప్ ఉపయోగించిన తర్వాత డిలీట్ చేస్తే ఇది సేకరించిన సమాచారం కూడా పూర్తిగా డిలీట్ అవుతుంది. పాండమిక్ పూర్తిగా తొలగిపోయిందని అధికారికంగా ప్రకటించిన తర్వాత సేకరించిన సమాచారాన్ని డిలీట్ చేస్తామని అధికారిక వెబ్‌సైట్‌లోనూ పేర్కొన్నారు. ఈ యాప్ కూడా బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది. కానీ మొబైల్ నెంబర్, పేరు, పిన్ కోడ్ వంటి వివరాలేవీ అడగదు.

చైనా: ఇక్కడ ప్రతి ఒక్కరికి కలర్ కోడింగ్ విధానాన్ని కేటాయించి, దీన్ని కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలి ట్రావెల్ హిస్టరీ, ఆరోగ్య స్థితి ఆధారంగా ఈ కోడింగ్ అమలు చేశారు. ఆకుపచ్చ రంగు వారు ఎక్కడికైనా వెళ్లొచ్చు, పసుపు రంగు వారు ఇంట్లోనే ఉండాలి, ఎరుపు రంగు వారు క్వారంటైన్‌లో ఉండాలి. అయితే అన్ని విషయాల వలెనే ఇందులోనూ చైనా చాలా గోప్యతను పాటించింది. డేటా ఎలా సేకరిస్తారు, సేకరించిన డేటాను ఎక్కడ భద్రపరుస్తారు, దాన్ని దేని కోసం ఉపయోగిస్తారు వంటి విషయాలేవీ బయటికి చెప్పకపోవడం గమనార్హం.

Advertisement

Next Story