కాఫీ కొట్టు నడపుతూ.. 23 దేశాలు చుట్టివచ్చిన వృద్ధ దంపతులు

by Shamantha N |   ( Updated:2020-03-18 03:53:54.0  )
కాఫీ కొట్టు నడపుతూ..  23 దేశాలు చుట్టివచ్చిన వృద్ధ దంపతులు
X

దేశాలు చుట్టి రావాలంటే.. దేశ ‌ప్రధాని కావాల్సిన అవసరం లేదు! క్రీడాకారులు, సినీ తారలే కానక్కర్లేదు. కోటానుకోట్ల రూపాయలకు అధిపతిగా ఉండాల్సిన పనిలేదు! లాటరీ గెలుచుకోనక్కర్లేదు! మరి ఎలా సాధ్యం అంటారా? మనం తలుచుకోవాలే గానీ.. ఏదైనా సాధ్యమే!. కేరళలోని కొచ్చిలో ఓ చిన్న కాఫీ కొట్టే నడిపే విజయన్‌ తన భార్యతో కలిసి 23 దేశాలు చుట్టి వచ్చి ఔరా అనిపించాడు. మరిన్ని దేశాలు విజిట్‌ చేసే పనిలో ఉన్న విజయన్‌ దంపతుల జర్నీ విషయాలు చదివేద్దాం.

జీవితంలో మధురమైన జ్ఞాపకాలను, వెలకట్టలేని ఆనందాలను మూట కట్టుకోవాలంటే.. కోటీశ్వరుడే కావాల్సిన అవసరం లేదు. ఓ బలమైన కోరిక ఉండటంతో పాటు.. అందుకోసం చక్కని ప్రణాళిక, చిన్నపాటి పొదుపు పాటిస్తే చాలు. అద్బుతాలు చేయొచ్చు. అందుకు కేరళకు చెందిన విజయన్‌, మోహన దంపతులే నిదర్శనం. ఈ దంపతులు కొచ్చిలో ‘‘శ్రీ బాలాజీ కాఫీ హౌజ్‌’’ అనే టీ, కాఫీ షాపు నడుపుతున్నారు. విజయన్ కు చిన్నప్పటి నుంచి ‌ప్రపంచ పర్యటన చేయాలనేది కల. ఇందుకు చాలా డబ్బులు అవసరమవుతాయని ఆయనకు తెలుసు. టీ, కాఫీలు, టిఫిన్లు అమ్మగా వచ్చే డబ్బు అందుకు సరిపోదని వారికి తెలుసు. మరి ఎలా తమ కలను నెరవేర్చుకోవాలి. అందుకు విజయన్ పెద్దగా ఏమీ చేయలేదు. తర్జన భర్జన పడలేదు. డబ్బులు సంపాదించడానికి నిద్రలేని రాత్రులు గడపలేదు. కానీ ఒక చిన్న పొదుపు మంత్రం పాటించాడు. అదే అతణ్ణి 23 దేశాలు తిరిగేలా చేసింది. ఏంటా టెక్నిక్ అంటే.. టీ అమ్మగా వచ్చే రాబడి నుంచి రోజు ౩౦౦ రూపాయలను పొదుపు చేసే వాళ్లు. ఇలా పొదుపు చేసిన సొమ్ముకు అదనంగా, బ్యాంకు నుంచి రుణం తీసుకుని … ఓ విదేశీ ట్రిప్‌కు ప్లాన్‌ వేసేవాళ్లు. పర్యటన ముగించి వచ్చిన తర్వాత తీసుకున్న రుణాన్ని తీర్చేసి మరో ట్రిప్‌కు ప్లాన్ చేసేవారు.

పెళ్లికి ముందు తన భార్య ఎర్నాకులం కూడా దాటి ఎక్కడికి వెళ్లేది కాదని, పెళ్లైన తర్వాత మాత్రం తనతో కలిసి దేశం మొత్తం తిరిగేసిందని ఆయన అంటున్నాడు. అంతేకాదు ఇప్పుడు విదేశాల్లో కూడా పర్యటిస్తూ మోహన ఎంతో సంతోషంగా ఉందని విజయన్‌ చెబుతాడు. తన బలం తన భార్యే అని, ఆమెపై తనకున్న ‌ప్రేమను మాటల్లో చెప్పలేనని చెమర్చిన కళ్లతో ఆనందంగా చెబుతాడు విజయన్‌. రాష్ర్టాలు, దేశాలు దాటడం కాదు.. ఇంటి నుంచి కాలు బయటపెట్టి మళ్లీ ఇంటికి వచ్చేంతవరకు కూడా అదో ప్రయాణమని ఆయన అంటాడు. విజయన్ 1963 నుంచి టీ అమ్ముతూ కుటుంబాన్ని నడుపుతున్నారు. ఆయన దుకాణంలోని గోడలపై వారి విదేశీ పర్యటనలకు సంబంధించిన ఫొటోలు, వాటి బిల్లులు, వివిధ దేశాల కరెన్సీ నోట్లను చూడొచ్చు. వాళ్లిద్దరూ కలిసి మన దేశంలో మద్రాస్‌, కన్యకుమారి, బెంగళూరు, ఢిల్లీ, హరిద్వార్‌ తిరిగి వచ్చారు. అలాగే ఈజిప్ట్‌, జోర్డాన్‌, లండన్‌, పారిస్‌, స్విట్జర్లాండ్‌, వెనిస్‌, సింగపూర్‌, మలేసియా ఇలా మొత్తంగా 23 దేశాలు చుట్టి వచ్చారు. తనతో ప్రయాణించిన వారందరూ బిలియనీర్లని.. వారంతా 100, 500 డాలర్ల నోట్లు మార్చుతుంటే.. తనేమో.. 5, 10 డాలర్‌ నోట్లను ఖర్చు చేసేవాడినని చెబుతాడు. ఇప్పటివరకు తిరిగిన 23 దేశాల్లో విజయన్‌‌కు సింగపూర్, స్విట్జర్లాండ్, న్యూయార్క్ దేశాలు బాగా నచ్చాయట.మహీంద్ర గ్రూప్ ఛైర్మన్‌ ఆనంద్ మహీంద్ర విజయన్ దంపతులపై రూపొందించిన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ… ‘ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో వారి పేరు కనిపించకపోవచ్చు. కానీ, వారు దేశంలో అత్యంత సంపన్నులు. వారి జీవన విధానమే వారికి ఆస్తి. నేను ఎప్పుడైనా ఆ నగరానికి వెళ్తే తప్పకుండా ఆగి, అక్కడ టీ తాగుతాను’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇంటర్నెల్‌లో తెగ వైరల్‌ అయ్యింది. ఈ జంటపై హరిమోహన్ అనే డైరెక్టర్ ‘ఇన్విజిబుల్ వింగ్స్’ అనే డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ చిత్రానికి 2018 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కార్యక్రమంలో నాన్ ఫిక్షన్ విభాగంలో అవార్డు దక్కింది. ఇందులో విజయన్ తన లైఫ్‘జర్నీ’ గురించి వివరించాడు. అబ్దుల్‌ కలాం అన్నట్లుగానే ఈ దంపతులిద్దరూ.. కలలు కన్నారు.. వాటిని సాకారం చేసుకున్నారు.

tags : vijayan, tea, coffee shop owner, 23 countries , visit, invisible wings

Advertisement

Next Story

Most Viewed