విషాదం: భార్య మృతదేహాన్ని భుజాలపై ఎత్తుకెళ్లిన భర్త

by Anukaran |
విషాదం: భార్య మృతదేహాన్ని భుజాలపై ఎత్తుకెళ్లిన భర్త
X

దిశ, కామారెడ్డి : కరోనా మహమ్మారి మానవ సంబంధాలను మంట కలుపుతోంది. పక్కనే ఓ వ్యక్తి సాధారణంగా మృతి చెందినా.. కరోనాతో చనిపోయి ఉండవచ్చన్న అనుమానంతో దగ్గరకు కూడా రావడం లేదు. ఓ యాచకురాలు మృతి చెందగా స్మశానానికి తరలించడానికి ఆటో డ్రైవర్లు ముందుకు రాకపోవడంతో మృతదేహాన్ని భర్త భుజంపై వేసుకుని శ్మశాన వాటికకు తీసుకెళ్లిన హృదయ విదారకర ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో భిక్షాటన చేసే యాచకురాలు నాగమణి ఆదివారం సాయంత్రం స్టేషన్ ఆవరణలో మృతి చెందింది. మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకు వెళ్ళడానికి నాగమణి భర్త స్వామి ఆటో కోసం ప్రయత్నించాడు.

అయితే నాగమణి కరోనాతోనే మృతి చెంది ఉంటుందని ఎవరు ముందుకు రాలేదు. గమనించిన రైల్వే పోలీసులు 2500 విరాళం చేసి స్వామికి ఇచ్చారు. అయినా ఆటో డ్రైవర్లు ముందుకు రాకపోవడంతో చేసేదేమీ లేక నాగమణి మృతదేహాన్ని సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న ఇందిరానగర్ శ్మశాన వాటిక వరకు భర్త స్వామి తన భుజంపై వేసుకుని తీసుకెళ్లాడు. మధ్యమధ్యలో మృతదేహాన్ని దింపి భిక్షాటన చేసుకుంటూ వెళ్లినట్టు తెలిసింది. ఇందిరానగర్ శ్మశాన వాటికలో నాగమణికి స్వామి అంత్యక్రియలు నిర్వహించాడు. మృతదేహాన్ని భుజంపై తీసుకెళ్తున్న దృశ్యాలు సిసి కెమెరాలలో రికార్డ్ అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed