దొంగ కోళ్లకు అలవాటుపడ్డ ప్రభుత్వ ఉద్యోగి.. ఎలా బుక్కయ్యాడంటే..?

by Sridhar Babu |   ( Updated:2021-06-11 00:59:10.0  )
Chicken Thief
X

దిశ,మోత్కూరు: పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్టుగా ఓ ప్రభుత్వ టీచర్ దొంగ కోళ్లకు అలవాటు పడి కోడిని దొంగతనం చేస్తూ కోడి యజమానికి అడ్డంగా దొరికిపోయాడు. సదరు కోళ్ల యజమాని అతని పై చర్యలుతీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విచిత్రమైన సంఘటన గురువారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. కోళ్ల యజమాని సురకంటి కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. కృష్ణారెడ్డికి చెందిన పెంపుడు నాటుకోళ్లు గత కొన్నిరోజులుగా ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. కృష్ణారెడ్డితో పాటు ఇరుగుపొరుగు వారి నాటు కోళ్లు సుమారు పది వరకు ఇలానే మాయమవుతుండగా అతని ఇంటి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిక్కులపల్లి సునీల్ పై అనుమానం వచ్చి నిఘా పెట్టారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు సునీల్ కృష్ణారెడ్డికి చెందిన పుంజుకు బియ్యం గింజలు వేసి ఇంట్లోకి రాగానే పట్టుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న కృష్ణారెడ్డి కోడి పుంజు అరుపులు వినపడంతో సునీల్ ఇంట్లోకి వెళ్లగా కోడిపుంజును పట్టుకుని బైక్ పై వెళుతున్న ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీంతో ఉపాధ్యాయుడు సునీల్ పుంజును, బైక్ ను అక్కడే వదిలి పరారయ్యాడు. కృష్ణారెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వగా అతని బైక్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారు. కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సునీల్ కు పోలీసులు ఫోన్ చేయగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెబుతున్నాడని, రిపోర్ట్ ఇవ్వమంటే సమాధానం దాటవేస్తున్నాడని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ జి.ఉదయ్ కిరణ్ విలేకరులకు తెలిపారు. కాగా సదరు ఉపాధ్యాయుడు గత మున్సిపల్ ఎన్నికలలో రెండు వార్డుల్లో ఓటు వేశాడని గుర్తించి అతని పై వేసిన కేసు కోర్టు విచారణలో ఉంది ప్రభుత్వ ఉపాధ్యాయుడై ఉండి ఇటువంటి చిల్లర దొంగతనాలకు పాల్పడం పట్ల సామాన్య ప్రజానీకం ముక్కున వేలు వేసుకుంటున్నారు

Advertisement

Next Story