నలుగురి ప్రాణాల కోసం ఫ్లైట్ డిలే

by Anukaran |   ( Updated:2020-11-30 08:48:13.0  )
నలుగురి ప్రాణాల కోసం ఫ్లైట్ డిలే
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎయిర్ ఇండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ ‘అలయెన్స్ ఎయిర్’ విమానం ఉదయం 8.15 నిమిషాలకు బయలుదేరడానికి రెడీగా ఉంది. ప్యాసింజర్స్ అందరూ కూడా విమానంలో కూర్చున్నారు. ఇక బయలుదేరుతుందనే సమయానికి ఆ విమాన సిబ్బందికి ఓ మెసేజ్ వచ్చింది. దాంతో ఫ్లైట్ డిలే అయ్యింది. గంట తర్వాత 9.25కు ఆ ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంది. ఫ్లైట్ లేట్ అయినందుకు మొదట ఓపిక కోల్పోయిన ప్యాసింజర్స్ అందరు కూడా విషయం తెలుసుకున్న తర్వాత సంతోషించారు. ఇంతకీ ఆ గంట సమయంలో అసలు ఏం జరిగింది? ఫ్లైట్ ఎందుకు డిలే చేశారు?

జైపూర్‌కు చెందిన 49 ఏళ్ల మహిళ.. తన కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలను దానం చేసి చనిపోయింది. అదే సమయంలో ఢిల్లీలో నలుగురు వ్యక్తులు అవయవదాతల కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఆ మహిళ నుంచి సేకరించిన అవయవాలను చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఆ నలుగురికి అమర్చితే వారు బతికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ ముఖ్యమంత్రి కార్యాలయం, స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎస్ఓటీటీఓ), ఎయిర్‌లైన్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఎయిర్ లైన్స్, జైపూర్ ఎయిర్‌పోర్ట్ అధికారులు అంతా కలిసి జైపూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరే అలయెన్స్ ఎయిర్‌కు చెందిన ఫస్ట్ ఫ్లైయిట్‌లో అవయవాలను పంపించాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా, అలయెన్స్ ఎయిర్ సమన్వయంతో ఫ్లైట్‌ను డిలే చేశారు. విమానాశ్రయానికి అవయవాలు చేరుకోగానే, ఫ్లైట్ ఢిల్లీకి బయలుదేరింది. అలా నలుగురు ప్రాణం కాపాడటంలో అలయెన్స్ ఎయిర్ విమాన సంస్థ చొరవ చూపింది. ఆలస్యం అమృతం విషమంటారు కానీ, ఈ విమానంలో ప్రయాణించిన వారు మాత్రం ఇక ముందు ఆలస్యం అమృతం జీవధానం అని అంటారు కాబోలు.

Advertisement

Next Story