ఎదురులేని ఎన్డీయే!.. తెలంగాణ, ఏపీలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో గెలుస్తుందంటే..?

by Swamyn |
ఎదురులేని ఎన్డీయే!.. తెలంగాణ, ఏపీలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో గెలుస్తుందంటే..?
X

దిశ, నేషనల్ బ్యూరో: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఎదురనేది ఉండదని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎలక్షన్లలో భారీ విజయం సాధించి, వరుసగా మూడోసారి అధికారం చేపట్టనుందని తెలిపింది. ‘ఇండియా టీవీ-సీఎన్ఎక్స్’ ఒపీనియన్ పోల్ నివేదిక ప్రకారం, దేశంలో ఇప్పటికిప్పడు ఎన్నికలు జరిగితే మొత్తం 543 స్థానాలకుగానూ అధికార ఎన్డీయే కూటమి ఏకంగా 378 సీట్లలో విజయం సాధిస్తుందని వెల్లడైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ (టీఎంసీ లేకుండా) కూటమి కేవలం 98 సీట్లలోనే విజయం సాధించనుందని నివేదిక పేర్కొంది. టీఎంసీతోపాటు వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేడీ సహా స్వతంత్రులు మిగిలిన 67 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని సర్వేలో తేలింది. టీవీ-సీఎన్ఎక్స్ పోల్ నివేదిక బుధవారం వెల్లడైంది. గత నెల 5 నుంచి 23 మధ్య మొత్తం 543 నియోజకవర్గాల్లో ఇందుకు సంబంధించిన సర్వేను నిర్వహించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1,62,900 మంది అభిప్రాయాలు సేకరించారు. వీరిలో 84,350 మంది పురుషులు ఉండగా, 78,550 మంది మహిళలు ఉన్నారు.

మోడీ టార్గెట్ మిస్!.. కానీ, 7 రాష్ట్రాల్లో క్లీన్‌స్వీప్

నివేదిక ప్రకారం, ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించనున్నప్పటికీ, ప్రధాని మోడీ అనుకున్నన్నీ సీట్లు మాత్రం రాకపోవచ్చు. ఈసారి ఎన్డీయే కూటమి మొత్తం 400 పైచిలుకు స్థానాల్లో గెలుపొందాలని కూటమి నేతలకు ప్రధాని మోడీ నిర్దేశించారు. ఇందులో ఒక్క బీజేపీయే 370కిపైగా నియోజకవర్గాల్లో కాషాయ జెండాను ఎగరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, తాజా నివేదిక ప్రకారం, వీరు తమ లక్ష్యానికి స్వల్ప దూరంలో ఆగిపోనున్నారు. ఎన్డీయే 378 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉండగా, ఒక్క బీజేపీయే 335 సీట్లు దక్కించుకోవచ్చని నివేదిక వెల్లడించింది. ఈ లెక్కనా, బీజేపీ 35 సీట్లు, ఎన్డీయే 22 స్థానాలు వెనుకబడుతోంది. సర్వే ప్రకారం, ఎన్డీయే కూటమి అనూహ్యంగా 7 రాష్ట్రాల్లో క్లీన్‌స్వీప్ చేయనుంది. గుజరాత్‌లోని మొత్తం 26 స్థానాల్లో జయకేతనం ఎగురవేయనుంది. అలాగే, మధ్యప్రదేశ్(29), రాజస్థాన్(25), హర్యానా(10), ఢిల్లీ(7), ఉత్తరాఖండ్(5), హిమాచల్ ప్రదేశ్(4)లలో క్లీన్ స్వీప్ చేయనుంది.

ప్రాంతీయ పార్టీలు ఇలా..

టీవీ-సీఎన్ఎక్స్ నివేదిక ప్రకారం, ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీ బెంగాల్‌లో 42 సీట్లకు గానూ 21 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. తమిళనాడులోని 39 స్థానాలకుగానూ అధికార డీఎంకే 20 సీట్లలో, ఏపీలోని 25 నియోజకవర్గాలకు వైసీపీ 15, టీడీపీ 10 స్థానాల్లో, ఒడిశాలోని 21 స్థానాలకు బీజేడీ 10 చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, తాజా నివేదిక ప్రకారం, అధికార కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. బీజేపీ 5, బీఆర్ఎస్ రెండు, ఏఐఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తాయని అంచనా. ఇక, 25 స్థానాలున్న ఏపీలో అధికార వైసీపీ 15, టీడీపీ 10 సీట్లను దక్కించుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.



Advertisement

Next Story