ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా రేవంత్ కాంగ్రెస్‌లో ఉండరు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా రేవంత్ కాంగ్రెస్‌లో ఉండరు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో కరీంనగర్ పార్లమెంట్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 90 రోజుల్లోనే ప్రజల అభిమానాన్ని కోల్పోయిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన పక్కనబెట్టి నోటికొచ్చినట్లు అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ అట్టర్ ప్లాప్ అంటే.. రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్‌ను గొప్పగా పొగుడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే రావాలని పరోక్షంగా రేవంత్ రెడ్డి కోరుకుంటున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పథకాలను కాపీ కొట్టిందని ఎద్దేవా చేశారు. రైతుబంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకున్నారు.. మిషన్ కాకతీయను కాపీ కొట్టి అమృత్ సరోవర్ అని పెట్టుకున్నారు.. అలాంటి గుజరాత్‌‌పై రేవంత్ రెడ్డి ప్రశంసలు చేయడం దారుణం అని అన్నారు. హిందువులు, ముస్లింలు కలిసి ఉండొద్దనేది గుజరాత్ నినాదమని.. అందుకే నిత్యం గొడవలు జరిగేలా ప్లాన్ చేస్తారని అన్నారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే కాంగ్రెస్‌లో కొనసాగేలా కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. మరో ఏక్‌నాథ్ షిండే, హిమంత బిశ్వశర్మ అవుతారేమో అనిపిస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలను తీసుకెళ్లి బీజేపీలో కలుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed