ఎన్నికల వేళ కంచుకోటలో MIM కు షాక్.. ఈసారి ఆ ఓట్లు కష్టమేనా?

by GSrikanth |
ఎన్నికల వేళ కంచుకోటలో MIM కు షాక్.. ఈసారి ఆ ఓట్లు కష్టమేనా?
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: పాతబస్తీలో సుమారు నాలుగు దశాబ్ధాలుగా తిరుగులేని శక్తిగా ఎదిగిన ఎంఐఎం పార్టీ ప్రాభవం తగ్గుతోందా? అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. గత ఎన్నికల వరకు ఓల్డ్ సిటీలో ఎంఐఎం విజయంపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. అయితే నెలల క్రితం ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పాతబస్తీలో ఎంఐఎంకు చెక్‌పెట్టడం కష్టమేమీకాదనే అభిప్రాయానికి రాజకీయ పార్టీలు వచ్చినట్లుగా కనబడుతోంది. శాసనసభ ఎన్నికలలో యాకుత్‌పురా నియోజకవర్గంలో ఎంఐఎం చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా విజయం సాధించగా గోషామహల్‌లో బీజేపీ గెలుపును నిలువరించలేకపోయింది. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం డీలిమిటేషన్ 2008లో జరిగింది.

1996లో జరిగిన ఎంపీ ఎన్నికలలో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పోటీ చేసి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ చేతిలో 73,273 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2004, 2009, 2014, 2019లలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అసదుద్ధీన్ ఒవైసీ వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అంతకు ముందు అతని తండ్రి సుల్తాన్ సలావుద్ధీన్ ఒవైసీ 1984, 1989, 1991, 1996, 1998, 1999 వరసగా ఆరు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. 2019లో లోక్ సభకు జరిగిన ఎన్నికలలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్ధీన్ ఒవైసీ 58.95 శాతం ఓట్లతో గెలుపొందారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంఐఎంకు ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ ప్రత్యర్థులు కూడా ప్రభావం చూపుతుండడంతో ఈ పర్యాయం ఆ ఘనత నిలబెట్టుకుంటుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇప్పుడు కాకపోతే మరెప్పుడు..?

హైదరాబాద్ లోక్ సభ పరిధిలో బోగస్ ఓట్లు అధికంగా ఉన్నాయని ఎన్నికల బరిలో ఉన్నఇతర పార్టీల అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఎంఐఎం పార్టీ వేల సంఖ్యలో బోగస్ ఓట్లు నమోదు చేయించిందని, వారిని గుర్తించి ఏరివేయాలని బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత మొదటి నుంచి డిమాండ్ చేయడం పరిస్థితికి అద్దంపడుతోంది. బోగస్ ఓట్ల ఏరివేతతో పాటు హిందువుల ఓట్లు బీజేపీకి పడితే గెలిచే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలో ఆమె ఉన్నారు. దీనికితోడు అయోద్యలో శ్రీరామమందిరం నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట అనంతరం హిందూ ఓటర్లలో మార్పు వచ్చిందని బీజేపీ బలంగా నమ్ముతోంది. పాతబస్తీలో ఎంఐఎంను ఓడించడానికి ఇంతకు మించిన అవకాశం ఇప్పుడుకాకపోతే మరెప్పుడు రాదని బీజేపీ అభ్యర్థి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది హిందువులను కూడా ఆలోచింపజేయడం శుభసూచకంగా భావిస్తూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా పాతబస్తీలో ఎంఐఎంను గట్టిగా ఎదుర్కొనేది బీజేపీ ఒక్కటేననేది ఓటర్లలోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ అభ్యర్థి కృషి చేస్తున్నారు.

అసెంబ్లీ ఫలితాల విశ్లేషణతో ముందుకు..

గత అసెంబ్లీ ఫలితాలను విశ్లేషిస్తూ బీజేపీ అభ్యర్థి ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. పూర్తి పాతబస్తీ ఓటర్లతో కూడిన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మలక్‌పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణ్‌గుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా సెగ్మెంట్లు ఉన్నాయి. మొత్తం ఏడింటిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రత్యర్థులు ఎంఐఎంకు గట్టిపోటీనిచ్చారు. గోషామహల్ నియోజకవర్గాన్ని బీజేపీ మరోమారు నిలబెట్టుకుంది. ఇక్కడ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా అభ్యర్థిని బరిలోకి దించలేదు. అయినా బీజేపీ గెలుపును నిలువరించలేకపోయారు. అలాగే యాకుత్‌పురాలో ఎంబీటీ కూడా గట్టి పోటీనిచ్చింది. యాకుత్‌పురాలో ఎంఐఎం కేవలం 878 స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందింది. ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుసేన్‌కు 32.86 శాతంతో 46,153 ఓట్లు, ఎంబీటీ అభ్యర్థి అమ్జదుల్లాఖాన్ 45,275 ఓట్లు పొందారు. బీజేపీ అభ్యర్థి ఎన్.వీరేంద్రబాబు యాదవ్ 15.92 శాతంతో 22,354 ఓట్లు సాధించారు.

కార్వాన్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి 83,388 ఓట్లు సాధించారు. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అమర్‌సింగ్ 41,402 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి ఐందాల కృష్ణయ్యకు 29,194, కాంగ్రెస్ అభ్యర్థి ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హాజ్రి 18,160 ఓట్లు పొందారు. మలక్‌పేట్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి అహ్మద్ బిన్ బలాలాకు 55,805 ఓట్లు పోలయ్యాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి అక్బర్ 29,699, బీజేపీ అభ్యర్థి సామ సురేందర్ రెడ్డి 23,731, బీఆర్ఎస్ అభ్యర్థి టీ.అజిత్ రెడ్డి 18,646 ఓట్లు సాధించారు. అయితే చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణ్‌గుట్ట నియోజకవర్గాలలో మాత్రం ఎంఐఎం తన పట్టును నిలబెట్టుకోగా ఎంఐఎం బలం, బలహీనతలపై బీజేపీ దృష్టిసారించడం రాబోయే ఎన్నికలలో హైదరాబాద్ పార్లమెంట్ ఫలితం ఎలా ఉండబోతుందనేది అందరీలో ఆసక్తిని కల్గిస్తోంది.

అధికార పార్టీతో ఎంఐఎం చెట్టాపట్టాల్...?

జీహెచ్ఎంసీ పరిధిలో జరిగే ఏఎన్నికలోనైనా ఎంఐఎం అధికార పార్టీతో జతకట్టడం ఆనవాయితీగా వస్తోంది. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఎంఐఎం పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీతో జట్టుకట్టింది. దీంతో పాతబస్తీలో ఎంఐఎంకు తిరుగులేకుండా పోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలు కావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్‌తో ఎంఐఎం దోస్తానా కట్ చేసుకుందనే టాక్ వినబడుతోంది. దీనికితగ్గట్లుగానే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో రెండు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి నియోజకవర్గంలో పలుమార్లు తన ఓటమికి కారణమైన ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ దోస్తానా చేస్తోందని ఆ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ మండిపడడం తెలిసిందే. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed