ఐపీఎల్-17 : ప్లే ఆఫ్స్‌‌ దిశగా రాజస్థాన్.. ఆ జట్లు ఆశలు వదులుకోవాల్సిందే!

by Dishanational3 |
ఐపీఎల్-17 : ప్లే ఆఫ్స్‌‌ దిశగా రాజస్థాన్.. ఆ జట్లు ఆశలు వదులుకోవాల్సిందే!
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఆయా జట్లు తమ మ్యాచ్‌ల్లో సగం ఆడేశాయి. కొన్ని జట్లు జోరు ప్రదర్శిస్తుంటే.. మరికొన్ని తడబడుతూ ముందుకు సాగుతున్నాయి. ఇంకొన్ని పేలవ ప్రదర్శనతో విమర్శలపాలవుతున్నాయి. సగం మ్యాచ్‌లు పూర్తవడంతో ప్లే ఆఫ్స్‌‌కు చేరుకునే జట్ల గురించి చర్చ మొదలైంది. గత రెండు సీజన్లను పరిశీలిస్తే టాప్-4లో నిలువాల్సిన జట్లు 8 విజయాలు అంటే 16 పాయింట్లు పొందాల్సి ఉంటుంది. 14 పాయింట్లతో కష్టమే. అయితే, అవకాశాలను కొట్టిపారేయలేం. నెట్‌రన్‌రేట్‌తో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. మరి, ఆయా జట్లుకు ప్లే ఆఫ్స్ ఆశలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

రాజస్థాన్ : శాంసన్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఈ సీజన్‌లో ఎదురులేకుండా పోయింది. 8 మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడింది. 7 విజయాలు సాధించింది. దీంతో 14 పాయింట్లు, +0.698 నెట్ రన్‌రేట్‌తో ఆ జట్టు అగ్రస్థానంలో ఉన్నది. మరో విజయం సాధిస్తే రాజస్థాన్ మరో విజయం సాధిస్తే దాదాపుగా నాకౌట్ బెర్త్ దక్కినట్టే.

కోల్‌కతా : గత రెండు సీజన్లలో నిరాశపర్చిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్‌లో సత్తాచాటుతున్నది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి, రెండింట ఓడింది. 10 పాయిట్లు, +1.206 నెట్‌ రన్‌రేటుతో రెండో స్థానంలో ఉన్నది. ఆ జట్టు ఇంకా 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. మూడింట గెలిస్తే ముందడగు వేసే అవకాశాలు ఉంటాయి.

హైదరాబాద్ : ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఈ సీజన్‌లో మొదట తడబడిన ఎస్‌ఆర్‌హెచ్ ఆ తర్వాత విధ్వంసకర ఆటతీరుతో ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తున్నది. కమిన్స్ సారథ్యంతోపాటు హెడ్, అభిషేక్, క్లాసెన్ మెరుపులు ఆ జట్టుకు అదనపు బలంగా మారాయి. ప్రస్తుతం ఆ జట్టు 10 పాయింట్లు, +0.914 నెట్‌ రన్‌రేట్‌తో మూడో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా పరిస్థితే హైదరాబాద్ కూడా. లీగ్ దశలో ఇంకా ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. మిగతా మ్యాచ్‌ల్లో కచ్చితంగా మూడు గెలిస్తేనే నాకౌట్ ఆశలు సజీవంగా ఉంటాయి. ప్రస్తుతం జోరునే కొనసాగిస్తే ప్లే ఆఫ్స్‌ బెర్త్ దక్కడం సునాయాసమే.

చెన్నయ్ : డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్స్ టైటిల్ నిలబెట్టుకోవడంపై ఫోకస్ పెట్టింది. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో సీఎస్కే ప్రస్తుతం 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నది. ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం, మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పొందింది. ఇంకా 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందుల్లో కచ్చితంగా నాలుగింట నెగ్గాల్సిందే. కాబట్టి, చెన్నయ్ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది.

లక్నో : గత రెండు సీజన్లలోనూ సైలెంట్‌గా ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న జట్టు లక్నో సూపర్ జెయింట్స్. ఈ సారి కూడా ఆ జట్టు నాకౌట్ చేరుకునే జట్ల జాబితాలో ఉంది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో జట్టు 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, మూడు ఓటములతో 5వ స్థానంలో ఉన్నది. మిగతా 7 మ్యాచ్‌ల్లో ఆ జట్టు కచ్చితంగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తేనే ముందుడగు వేసే అవకాశం ఉంటుంది.

గుజరాత్ : గత రెండు సీజన్లలో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్.. ఈ సారి కొత్త కెప్టెన్ గిల్ సారథ్యంలో తడబాటుకు గురవుతున్నది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో నాలుగింట విజయాలు, నాలుగింట పరాజయాలు పొందింది. 8 పాయింట్లు, -1.055 నెట్‌రన్‌రేట్‌తో 6వ స్థానంలో ఉన్నది. గుజరాత్ ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో నాలుగు విజయాలు సాధించడం తప్పనిసరి. కాబట్టి, మిగతా మ్యాచ్‌ల్లో ఆ జట్టు బలంగా పుంజుకోవాల్సి ఉంది.

ముంబై : పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ తడబడుతున్నది. వరుసగా ఢిల్లీ, బెంగళూరుపై విజయాలతో పుంజుకున్నట్టు కనిపించింది. కానీ, గత మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓడి తిరిగి ఓటమి బాట పట్టింది. ప్రస్తుతం ముంబై 8 మ్యాచ్‌ల్లో మూడింట మాత్రమే నెగ్గింది. ఐదింట పరాజయం పాలైంది. ముంబైకి ప్లే ఆఫ్స్‌ ఆశలు చాలా కష్టమనే చెప్పాలి. ఆడాల్సిన ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి. కనీసం ఐదింట నెగ్గితేనే ఆశలు సజీవంగా ఉంటాయి.

ఢిల్లీ : ఢిల్లీ క్యాపిటల్స్‌ది ముంబై పరిస్థితే. పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో మూడింట మాత్రమే నెగ్గింది. ఐదు పరాజయాలు పొందిన ఆ జట్టు 6 పాయింట్లతో నిలిచి నాకౌట్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. మిగతా ఆరు మ్యాచ్‌ల్లో రెండింట ఓడితే ఆ జట్టు ఆశలు గల్లంతయినట్టే. ఐదు విజయాలు సాధిస్తేనే పోటీలో ఉంటుంది. అయితే, రాజస్థాన్, కోల్‌కతా, లక్నో వంటి జట్లతో ఆడాల్సి ఉండటంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ బెర్త్‌‌పై అనుమానాలు నెలకొన్నాయి.

పంజాబ్ : ఈ సీజన్‌లోనూ పంజాబ్ కింగ్స్ నాకౌట్ రౌండ్‌కు చేరుకోవడం కష్టమే. 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు సాధించిన ఆ జట్టు 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నది. వరుసగా నాలుగు ఓటములతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపుగా గల్లంతు చేసుకుంది. మిగతా ఆరు మ్యాచ్‌లకుగానూ ఆరింట నెగ్గితే తప్ప ఆ జట్టుకు నాకౌట్ అవకాశాలు ఉంటాయి. అయితే, అది అంత సులభం కాదు.

బెంగళూరు : ఈ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి మరీ దారుణం. 8 మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లోనే నెగ్గింది. ఏడు ఓటములతో ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ దారులు మూసుకపోయాయి. అద్భుతం జరిగితే తప్ప టోర్నీలో ఆర్సీబీ ముందడుగు వేయలేదు. మిగతా ఆరు మ్యాచ్‌ల్లో ఆరింట భారీ విజయాలు సాధించాలి. అప్పుడు 14 పాయింట్లతో నిలుస్తుంది. అదే సమయంలో మిగతా జట్లు ఓడిపోవాలి. అప్పుడు నెట్‌రన్‌రేట్ ఆ జట్టుతో ముందడుగు వేయొచ్చు.



Next Story

Most Viewed