కేకేఆర్ జట్టులో మరో సునామీ..ఎవరీ రఘువంశీ

by Harish |
కేకేఆర్ జట్టులో మరో సునామీ..ఎవరీ రఘువంశీ
X

దిశ, స్పోర్ట్స్ : విశాఖలో ఢిల్లీపై కోల్‌కతా సృష్టించిన పరుగుల సునామీ అంతా ఇంతా కాదు. ఈ తుపాన్‌లో భాగమయ్యాడు ఓ 18 ఏళ్ల కుర్రాడు. సునీల్ నరైన్‌తో కలిసి అతను విధ్వంసం సృష్టించాడు. తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను బౌండరీలకు పంపించడంతో ఆ కుర్రాడి ఉప్పెన మొదలైంది. అది కూడా నోర్జే బౌలింగ్‌లో. ఆ తర్వాత కూడా అతని దూకుడు అలాగే కొనసాగింది. ఆ కుర్రాడికి ఇన్నింగ్స్‌పరంగా అదే తొలి మ్యాచ్. మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో చెలరేగిన అతను తన ఆటతో అందరూ తన గురించే మాట్లాడుకునేలా చేశాడు. ఆ కుర్రాడే అంగ్‌క్రిష్ రఘువంశీ. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కోల్‌కతా జట్టులో మరో రింకు సింగ్‌ను గుర్తు చేశాడు.

ఢిల్లీపై ఇన్నింగ్స్‌తో రఘువంశీ వెలుగులోకి వచ్చినా.. 2022లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లోనే అతను సత్తాచాటాడు. భారత్ టైటిల్‌ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో రఘువంశీ 278 పరుగులతో భారత్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీలో పెట్టిన రఘువంశీ 11 ఏళ్ల వయసులో ముంబైకి వచ్చాడు. అభిషేక్ నాయర్(కేకేఆర్ బౌలింగ్ కోచ్), ఓంకార్ సల్వీ శిక్షణలో రాటుదేలిన అతను అండర్-19 టోర్నీల్లో అదరగొట్టాడు. దీంతో 2022లో వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌‌కు ఎంపికయ్యాడు. అక్కడ సత్తాచాటిన అతను.. గతేడాది ముంబై తరపున దేశవాళీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ, సయ్యర్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పర్వాలేదనిపించాడు. 5 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 133 పరుగులు, 9 టీ20ల్లో 192 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీకే నాయుడు ట్రోఫీలో రఘువంశీ అదరగొట్టాడు. 9 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో 765 పరుగులు చేశాడు.

అనుకోకుండా తుది జట్టులోకి..

ఐపీఎల్-2024 వేలంలో రఘువంశీని కోల్‌కతా రూ. 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే, అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందని రఘువంశీ కూడా ఊహించి ఉండడు. నితీశ్ రాణా తొలి మ్యాచ్‌లో గాయపడటంతో అతనికి అనుకోకుండా అవకాశం దక్కింది. ఈ నెల 29న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రఘువంశీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. అయితే, అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఢిల్లీతో మ్యాచ్‌లోనూ అతనికి తుది జట్టులో చోటు దక్కగా.. ఆ మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ బ్యాటింగ్ వ్యూహాలు అతనికి కలిసొచ్చాయి. వెంకటేశ్ అయ్యర్‌కు బదులు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రఘువంశీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగాడు. నరైన్‌తో కలిసి రెండో వికెట్‌కు 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మిగతా మ్యాచ్‌ల్లోనూ రఘువంశీ ఇదే తరహాలో రాణిస్తే జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకోవడం ఖాయమే.

Advertisement

Next Story