రస్సెల్ విధ్వంసం.. తేలిపోయిన హైదరాబాద్ బౌలర్లు

by Harish |
రస్సెల్ విధ్వంసం.. తేలిపోయిన హైదరాబాద్ బౌలర్లు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 సీజన్ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. రస్సెల్ విధ్వంసానికితోడు ఫిలిప్ సాల్ట్ రాణించడంతో కోల్‌కతా నైట్ రైడర్స్.. హైదరాబాద్ ముందు 209 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. కోల్‌కతా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 208 పరుగుల భారీ స్కోరు చేసింది.

మొదట సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(0), నితీశ్ రాణా(9), వెంకటేశ్ అయ్యర్(7), సునీల్ నరైన్(2) దారుణంగా నిరాశపరిచారు. దీంతో కోల్‌కతా 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో ఆ జట్టు స్వల్ప స్కోరుకే ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే, మరో ఎండ్‌లో మాత్రం ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(54) జట్టుకు అండగా నిలిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడిన అతను హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతనికితోడు రమన్‌దీప్ సింగ్(35) ధాటిగా ఆడటంతో కోల్‌కతా గాడిలో పడింది.

అయితే, స్వల్ప వ్యవధిలోనే వీరు పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ బౌలర్లు పుంజుకున్నట్టు కనిపించారు. కానీ, ఆ ఆశలు ఎంతో సేపు నిలువలేదు. రస్సెల్(64 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లతో ఊచకోతకోశాడు. మరో ఎండ్‌లో ధాటిగా ఆడిన రింకు సింగ్(23) ఆఖరి ఓవర్‌లో అవుటయ్యాడు. రస్సెల్ పరుగుల వరద పారించడంతో 16 నుంచి 19 ఓవర్ల మధ్యనే 77 పరుగులు రావడంతో జట్టు స్కోరు 200 దాటింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లు తీయగా.. మయాంక్ మార్కండే 2వికెట్లు పడగొట్టాడు. పాట్ కమిన్స్‌కు ఒక్క వికెట్ దక్కింది.

Advertisement

Next Story