IPL 2023: నేడు రాజస్థాన్‌తో చెన్నయ్ ఢీ..

by Vinod kumar |   ( Updated:2023-04-11 18:45:29.0  )
IPL 2023: నేడు రాజస్థాన్‌తో చెన్నయ్ ఢీ..
X

చెన్నయ్: ఐపీఎల్-16లో రాజస్థాన్ రాయల్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ చెరో రెండు విజయాలు సాధించాయి. పాయింట్ల పట్టికలో మెరుగైన రన్‌రేట్‌తో రాజస్థాన్ రెండో స్థానంలో ఉండగా.. సీఎస్కే ఐదో స్థానంలో ఉన్నది. వేటికవే ప్రత్యేకతలు కలిగిన ఈ రెండు జట్లు ఈ సీజన్‌లో నేడు తొలిసారిగా ఎదురుపడబోతున్నాయి. ఇరుజట్ల మధ్య చివరి 10 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. చెన్నయ్, రాజస్థాన్ చెరో ఐదు విజయాలు సాధించాయి. అయితే, గత సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ నెగ్గింది. ప్రస్తుత సీజన్‌లో తొలిసారిగా తలపడబోతుండగా.. విజయంపై ఇరు జట్లు కన్నేశాయి. బ్యాటింగ్ పరంగా రాజస్థాన్ బలమెంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


యశస్వి జైశ్వాల్, బట్లర్, శాంసన్ త్రయం మంచి ఫామ్‌లో ఉండటంతోపాటు ఫినిషర్ రోల్ పోషించేందుకు హెట్మేయర్, ధ్రువ్ జురెల్ సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌పరంగా స్పిన్నర్లు అశ్విన్, చాహల్‌, పేసర్లు బౌల్ట్, హోల్డర్ రాణిస్తుండటం రాజస్థాన్‌కు సానుకూలంశం. మరోవైపు, చెన్నయ్ బ్యాటింగ్ దళంలో లోపాలు అధిగమిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. ప్రస్తుతం గైక్వాడ్ మాత్రమే ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అయితే, గత మ్యాచ్‌లో రహానే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. అతడు నేటి మ్యాచ్‌లోనూ అదే తరహాలో రెచ్చిపోతే చెన్నయ్‌కు మరింత బలపడినట్టే. ఇప్పటివరకు తమస్థాయి ప్రదర్శన చేయని కాన్వే, స్టోక్స్, జడేజా, అంబటి రాయుడు, శివమ్ దూబె.. పటిష్టమైన రాజస్థాన్‌పై నేడు చెలరేగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఫినిషర్ రోల్‌కే పరిమితమైన ధోనీ గత మ్యాచ్‌ల్లో తక్కువ బంతులే ఆడాడు. అయితే, అతను ఫామ్‌లో ఉన్నట్టు కనిపిస్తుండటంతో చెన్నయ్‌కు ఫినిషర్ ఢోకా లేదని చెప్పొచ్చు. ముంబైతో మ్యాచ్‌తో చెన్నయ్ బౌలింగ్ పరంగా మెరుగైనట్టే కనిపించింది. ముఖ్యంగా అదనపు పరుగులను తగ్గించుకుంది. గత మ్యాచ్‌లో గాయపడిన దీపక్ చాహర్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో దాదాపుగా ఉండకపోవచ్చు. బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మిచెల్ సాంట్నర్, హంగర్గేకర్‌లతోపాటు స్పిన్నర్లు జడేజా, మొయిన్ అలీ కీలకంగా మారాల్సిన అవసరం ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed