హైదరాబాద్ మళ్లీ బోల్తా.. చెన్నయ్‌కు భారీ విజయం

by Harish |
హైదరాబాద్ మళ్లీ బోల్తా.. చెన్నయ్‌కు భారీ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ బోల్తా పడింది. బెంగళూరు చేతిలో ఓడిన ఆ జట్టు.. చెన్నయ్‌ ముందు కూడా తేలిపోయింది. చెన్నయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్ చేతిలో 78 పరుగుల తేడాతో ఘోర ఓటమిని పొందింది. తొలి గ్రూపు మ్యా్చ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న సీఎస్కే.. వరుసగా రెండు పరాజయాల తర్వాత ఈ గెలుపుతో పుంజుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నయ్ 212/3 స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(98) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో సీఎస్కే భారీ స్కోరు చేసింది. డారిల్ మిచెల్(52) సైతం రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 134 పరుగులకే ఆలౌటైంది. మార్‌క్రమ్(32) టాప్ స్కోరర్. బంతితో చెలరేగిన తుషార్ దేశ్‌పాండే(4/27) ఎస్‌ఆర్‌హెచ్ పతనాన్ని శాసించాడు.

తేలిపోయిన హైదరాబాద్

హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. కనీసం పోరాటం చేయలేకపోవడం గమనార్హం. ఛేదనలో మొదటి నుంచే హైదరాబాద్‌ను చెన్నయ్ బౌలర్లు కట్టడి చేశారు. ముఖ్యంగా తుషార్ దేశ్‌పాండే ఆ జట్టు పతనాన్ని శాసించాడు. ఓపెనర్లు హెడ్(13), అభిషేక్ శర్మ(15)లను రెండో ఓవర్‌లో అవుట్ చేసిన అతను.. వరుస ఓవర్‌లో అన్మోల్‌ప్రీత్ సింగ్(0)ను డకౌట్ చేశాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో హైదరాబాద్ పుంజుకోలేకపోయింది. మార్‌క్రమ్(32) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా అది కాసేపే. దీంతో హైదరాబాద్ ఓటమి ఖరారవ్వగా.. నితీశ్ రెడ్డి(15), క్లాసెన్(20), అబ్దుల్ సమద్(19) కూడా జట్టును ఆదుకోలేకపోయారు. కమిన్స్(5)ను తుషార్ దేశ్‌పాండే పెవిలియన్ పంపగా.. 19వ ఓవర్‌లో షాబాజ్ అమ్మద్(7), జయదేవ్ ఉనద్కత్(1)లను ముస్తాఫిజుర్ అవుట్ చేసి హైదరాబాద్ ఆట ముగించాడు. చెన్నయ్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 4 వికెట్లతో విజృంభించగా.. ముస్తాఫిజుర్, పతిరణ రెండేసి వికెట్లతో సత్తాచాటారు. జడేజా, శార్దూల్‌ తలా ఓ వికెట్ తీశారు.

గైక్వాడ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్

అంతకుముందు చెన్నయ్ 200కుపైగా స్కోరు చేసిందంటే కారణం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన అతను ఓపెనర్‌గా వచ్చి చివరి ఓవర్ వరకూ నిలిచాడు. అయితే, మొదట చెన్నయ్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఓపెనర్ రహానే(9)ను అవుట్ చేసి భువనేశ్వర్ షాకిచ్చాడు. అయితే, మరో ఓపెనర్ గైక్వాడ్ మాత్రం క్రీజులో పాతుకపోయాడు. డారిల్ మిచెల్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. మొదట నిదానంగా ఆడిన గైక్వాడ్ షాబాజ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో ట్రాక్‌లో పడ్డాడు. ఆ తర్వాత కూడా చక్కటి షాట్లు ఆడుతూ స్కోరు వేగం పెంచాడు. ఈ క్రమంలోనే కమిన్స్ బౌలింగ్‌లో సిక్స్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం డారిల్ మిచెల్(51) కూడా దూకుడు పెంచాడు. ఓవర్‌కో బౌండరీ దంచుతూ జోరు కనబర్చాడు. అయితే, హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాతి ఓవర్‌లోనే అతన్ని ఉన్కదత్ అవుట్ చేయడంతో ఈ జోడీని విడిపోయింది. మిచెల్ అవుటైన తర్వాత గైక్వాడ్ మరింత దూకుడు పెంచాడు. భువీ బౌలింగ్‌లో 6, 4 దంచిన అతను ఆ తర్వాతి ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. శివమ్ దూబె(39 నాటౌట్) కూడా బ్యాటు ఝుళిపించడంతో 19 ఓవర్లలో స్కోరు 200 పరుగుల మార్క్‌ను అందుకుంది. అయితే, ఆఖరి ఓవర్‌లో గైక్వాడ్(98) క్యాచ్ అవుటై తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. ధోనీ(5 నాటౌట్), దూబె కలిసి 12 పరుగులు పిండుకోవడంతో చెన్నయ్ ఇన్నింగ్స్ ముగిసింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, నటరాజన్, జయదేవ్ ఉనద్కత్‌లకు చెరో వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

చెన్నయ్ సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : 212/3(20 ఓవర్లు)

రహానే(సి)షాబాజ్ అహ్మద్(బి)భువనేశ్వర్ 9, రుతురాజ్ గైక్వాడ్(సి)నితీశ్ రెడ్డి(బి)నటరాజన్ 98, డారిల్ మిచెల్(సి)నితీశ్ రెడ్డి(బి)జయదేవ్ ఉనద్కత్ 52, శివమ్ దూబె 39 నాటౌట్, ధోనీ 5 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 9.

వికెట్ల పతనం : 19-1, 126-2, 200-3

బౌలింగ్ : భువనేశ్వర్(4-0-38-1), నితీశ్ రెడ్డి(1-0-8-0), షాబాజ్ అహ్మద్(3-0-33-0), నటరాజన్(4-0-43-1), జయదేవ్ ఉనద్కత్(4-0-38-1), కమిన్స్(4-0-49-0)

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 134 ఆలౌట్(18.5 ఓవర్లు)

హెడ్(సి)మిచెల్(బి)తుషార్ దేశ్‌పాండే 13, అభిషేక్(సి)మిచెల్(బి)తుషార్ దేశ్‌పాండే 15, అన్మోల్‌ప్రీత్(సి)మొయిన్ అలీ(బి)తుషార్ దేశ్‌పాండే 0, మార్‌క్రమ్(బి)పతిరణ 32, నితీశ్ రెడ్డి(సి)ధోనీ(బి)జడేజా 15, క్లాసెన్(సి)మిచెల్(బి)పతిరణ 20, అబ్దుల్ సమద్(సి)సమీర్ రిజ్వీ(బి)శార్దూల్ 19, షాబాజ్ అహ్మద్(సి)మిచెల్(బి)ముస్తాఫిజుర్ 7, కమిన్స్(సి)మిచెల్(బి)తుషార్ దేశ్‌పాండే 5, భువనేశ్వర్ 4 నాటౌట్, జయదేవ్ ఉనద్కత్(సి)మొయిన్ అలీ(బి)ముస్తాఫిజుర్ 1; ఎక్స్‌ట్రాలు 3.

వికెట్ల పతనం : 21-1, 21-2, 40-3, 72-4, 85-5, 117-6, 119-7, 124-8, 132-9, 134-10

బౌలింగ్ : దీపక్ చాహర్(3-0-22-0), తుషార్ దేశ్‌పాండే(3-0-27-4), ముస్తాఫిజుర్(2.5-0-19-2), జడేజా(4-0-22-1), శార్దూల్(4-0-27-1), పతిరణ(2-0-17-2)

Advertisement

Next Story

Most Viewed