ప్లే ఆఫ్స్‌కు బెన్‌స్టోక్స్, మార్క్‌వుడ్ దూరం

by Javid Pasha |
ప్లే ఆఫ్స్‌కు బెన్‌స్టోక్స్, మార్క్‌వుడ్ దూరం
X

చెన్నయ్ : ఐపీఎల్-16 ప్లే ఆఫ్స్‌కు చెన్నయ్ సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్, లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మార్క్‌వుడ్ అందుబాటులో ఉండటం లేదు. సీఎస్కే, లక్నో జట్లు నాకౌట్‌ రౌండ్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే, జాతీయ జట్టు బాధ్యతల కారణంగా వీరిద్దరూ ఇంగ్లాండ్‌కు బయల్దేరారు. జూన్ 1 నుంచి ఐర్లాండ్‌తో ఇంగ్లాండ్ ఏకైక టెస్టు ఆడనుంది. ఈ తర్వాత ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌కు సిద్ధం కానుంది. బెన్‌స్టోక్స్ ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వేలంలో రూ. 16.25 కోట్ల భారీ ధర పలికిన స్టోక్స్ లీగ్‌లో మెరవలేకపోయాడు. కేవలం రెండు మ్యాచ్‌లే ఆడిన అతను 15 పరుగులు మాత్రమే చేశాడు.

అనంతరం మోకాలి గాయంతో తుది జట్టులో ఆడలేదు. లక్నో పేసర్ మార్క్‌వుడ్ దూరం కావడం ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఈ సీజన్‌లో అతను 4 మ్యాచ్‌ల్లోనే పాల్గొన్నప్పటికీ 11 వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో దాదాపు 13 మంది ఇంగ్లాండ్ ప్లేయర్స్ పాల్గొన్నారు. స్టోక్స్, మార్క్‌వుడ్‌తోపాటు మిగతా క్రికెటర్లు కూడా ఇంగ్లాండ్ వెళ్లనున్నారు. అయితే, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు లీగ్ దశను దాటలేదు. సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్న మొయిన్ అలీ మాత్రం ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండనున్నాడు.

Advertisement

Next Story