T20 World Cup : మినీ ఇండియాతో ఇండియా ఢీ.. నేడు ఆసక్తికర పోరు

by Harish |
T20 World Cup : మినీ ఇండియాతో ఇండియా ఢీ.. నేడు ఆసక్తికర పోరు
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్న టీమ్ ఇండియా ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. నేడు న్యూయార్క్ వేదికగా మూడో గ్రూపు మ్యాచ్‌లో అమెరికాతో తలపడనుంది. గెలిస్తే భారత జట్టు సూపర్-8 రౌండ్‌కు చేరుకున్నట్టే. మరోవైపు, అమెరికా కూడా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. గత మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన ఆ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉన్నది. అయితే, యూఎస్‌ఏ జట్టు‌లో అత్యధికంగా భారత మూలాలు ఉన్న క్రికెటర్లే ఉన్నారు. జట్టు విజయాల్లో కూడా వారిదే కీలక పాత్ర. దీంతో ఈ మ్యాచ్ ఇండియా వర్సెస్ మినీ ఇండియాగా మారిపోయింది. మరి, రోహిత్ సేన ఏం చేస్తుందో చూడాలి.

బ్యాటింగ్‌లో మెరగవ్వాలి

గత రెండు మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్ల ప్రదర్శన గొప్పగా లేదు. బ్యాలర్లు రాణించడంతోనే గెలిచాం. ముఖ్యంగా పాక్‌పై బుమ్రా, పాండ్యా మెరవకపోతే పరిస్థితి మరోలా ఉండేది. పిచ్ బ్యాటర్లకు ప్రతికూలంగా ఉండటం వాస్తవమే. అయితే, అనవసర షాట్లు ఆడి వికెట్లు పారేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. పంత్ ఒక్కడే నిలకడ ప్రదర్శన చేస్తున్నాడు. రోహిత్, విరాట్, సూర్యకుమార్ విఫలమవడం ఆందోళన పెంచుతోంది. గత మ్యాచ్‌ల్లో దూబె, పాండ్యా, జడేజా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టీమ్ ఇండియా సూపర్-8 రౌండ్‌కు చేరుకోవడం దాదాపు ఖాయమే. కాబట్టి, గ్రూపు దశలోనే భారత్ బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాల్సి అవసరం ఉన్నది. అందుకు అమెరికాతో మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు. మరోవైపు, బౌలింగ్ పరంగా టీమ్ ఇండియా పటిష్టంగా ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుమ్రా, పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్‌లతో పేస్ దళంగా ప్రస్తుతం భారత్‌కు ప్రధానంగా ఉన్నది.

అమెరికాలో వీళ్లతో జాగ్రత్త

ఏ విధంగా చూసుకున్నా టీమ్ ఇండియాకు అమెరికా పోటీనే కాదు. కానీ, పాక్‌కు షాకిచ్చిన ఆ జట్టును ఈజీగా తీసుకోవడానికి లేదు. కెప్టెన్‌ మోనాంక్ పటేల్‌తోపాటు నితీశ్ కుమార్, హర్మీత్ సింగ్, జస్‌దీప్ సింగ్, నోస్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రావల్కర్ భారత సంతతి క్రికెటర్లే. బ్యాటింగ్‌లో మోనాంక్, ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లలో కెంజిగే, నేత్రావల్కర్ నుంచి భారత్‌కు సవాల్ తప్పదు.

తుది జట్లు (అంచనా)

భారత్ : రోహిత్(కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, శివమ్ దూబె, పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

అమెరికా : స్టీవెన్ టేలర్, మోనాంక్ పటేల్(కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీశ్ కుమార్, అండర్సన్, హర్మీత్ సింగ్, జస్‌దీప్ సింగ్, నోస్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్.

Advertisement

Next Story

Most Viewed