పంత్ విధ్వంసం.. వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాపై భారత్ విజయం

by Harish |
పంత్ విధ్వంసం.. వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాపై భారత్ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌కు టీమ్ ఇండియాకు ఆత్మవిశ్వాసం పెంచే విజయం దక్కింది. న్యూయార్క్ వేదికగా శనివారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 60 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 182/5 స్కోరు చేసింది. టార్గెట్ ఛేదనలో బంగ్లాదేశ్ తేలిపోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేసింది. ఛేదనలో తొలి ఓవర్‌ నుంచే ఆ జట్టు తడబడింది. అర్ష్‌దీప్ సింగ్ వరుస ఓవర్లలో సౌమ్య సర్కార్(0), లిటాన్ దాస్(6)లను అవుట్ చేయడంతో ఆ జట్టు పతనం మొదలైంది. మహ్మదుల్లా(40) టాప్ స్కోరర్. మిగతా వారు భారత బౌలర్ల ధాటికి పెవిలియన్‌‌కు క్యూకట్టారు. మహ్మదుల్లా, షకీబ్ అల్ హసన్(28) క్రీజులో నిలబడటంతో ఆ జట్టు ఆలౌట్ ప్రమాదం నుంచి బయటపడింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబె రెండేసి వికెట్లతో సత్తాచాటారు. బుమ్రా, సిరాజ్, పాండ్యా, అక్షర్ పటేల్‌కు చెరో వికెట్ దక్కింది.

చెలరేగిన పంత్‌, పాండ్యా, సూర్య

అంతకుముందు భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌గా వచ్చిన శాంసన్(1) నిరాశపర్చడంతో 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఐపీఎల్ జోరును కొనసాగించాడు. మరో ఓపెనర్ రోహిత్(23) నిదానంగా ఆడగా.. పంత్ మాత్రం చెలరేగిపోయాడు. షకీబ్ బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు కొట్టాడు. కాసేపటికే రోహిత్ అవుటైనా.. పంత్ మాత్రం దూకుడు ఆపలేదు. సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో వరుసగా 4, 4 కొట్టిన అతను ఆ తర్వాతి ఓవర్‌లో ఓ సిక్సర్ బాదాడు. చూస్తుండగానే పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మిగతా వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అతను రిటైర్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన శివమ్ దూబె(14) నిరాశపర్చగా.. సూర్యకుమార్(31) కాసేపే క్రీజులో ఉన్నా తనదైన శైలిలో బ్యాటు ఝుళిపించాడు. ఇక, హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తాచాటాడు. ఐపీఎల్ విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న అతను బ్యాటుతో సమధానం చెప్పాడు. 23 బంతుల్లో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో మహేది హసన్, షోరిఫుల్ ఇస్లామ్, మహ్మదుల్లా, తాంజిమ్ హసన్‌లకు చెరో వికెట్ దక్కింది.

సంక్షిప్త స్కోరుబోర్డు

భారత్ ఇన్నింగ్స్ : 182/5(20 ఓవర్లు)

(పంత్ 53, హార్దిక్ పాండ్యా 40 నాటౌట్, సూర్యకుమార్ 31)

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ : 122/9(20 ఓవర్లు)

(మహ్మదుల్లా 40, షకీబ్ 28, అర్ష్‌దీప్ సింగ్ (2/12), శివమ్ దూబె (2/13))

Advertisement

Next Story