నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం

by Disha Web Desk 15 |
నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం
X

దిశ,చౌటుప్పల్ : నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 17 మందిని ఓ వ్యక్తి మోసం చేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా పెద్ద శంకరంపేట గ్రామానికి చెందిన ఆకుల అజయ్ కుమార్(37) సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని లిటిల్ ఫ్లవర్ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తున్నాడు. గత మూడు నెలల క్రితం అజయ్ కుమార్ చౌటుప్పల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చి తాను డాక్టర్ ను అని చెప్పి ఆస్పత్రి యాజమాన్యంతో పరిచయం చేసుకున్నాడు. ఆసుపత్రి తనకు లీజుకు కావాలని రెండు రోజుల తర్వాత ఓ వ్యక్తిని తీసుకుని వచ్చి ఆసుపత్రిని పరిశీలించాడు.

అనంతరం తన భార్య పిల్లలతో కలిసి చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామంలో ఓ ఇల్లును కిరాయికి తీసుకొని ఉన్నాడు. తన పిల్లలు ఇద్దరిని కొయ్యలగూడెంలోని దీప్తి హైస్కూల్లో జాయిన్ చేసి చౌటుప్పల్ లోని ఆస్పత్రికి నిత్యం వెళ్లి వస్తుండేవాడు. మూడు నెలలు గడిచినా ఆస్పత్రి నిర్వాహకురాలు గౌరీదేవి అతన్ని డాక్టర్ గా నమ్మలేదు. దీంతో ఆమె అజయ్ కుమార్ ను తన ఆసుపత్రిలో ఓపీ విభాగంలో నియమించుకుంది. అదే సమయంలో సదరు ఆసుపత్రిలో పనిచేస్తున్న సిస్టర్స్ తో పరిచయం పెంచుకున్న అజయ్ కుమార్ తాను సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో పనిచేస్తున్నానని, అందుకు సంబంధించిన ఐడి కార్డులను వారికి చూపించి నమ్మించాడు.

ఇదే సందర్భంలో రైల్వే ఆస్పత్రిలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని చెప్పి వాటికి దరఖాస్తు చేసుకోమని సదరు స్టాఫ్ నర్స్ లను ఒప్పించాడు. తాను ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించి అందుకు 17 లక్షల 45 వేల రూపాయలు 17 మంది వద్ద తీసుకొని ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో అనుమానం వచ్చిన సదరు స్టాఫ్ నర్సులు ఆసుపత్రి నిర్వాహకురాలితో కలిసి చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు చౌటుప్పల్ సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed