Theft : ఆన్‌లైన్ గేమ్ కోసం రూ. 2.10లక్షలు చోరీ చేసిన వీఆర్ఏ

by Aamani |
Theft : ఆన్‌లైన్ గేమ్  కోసం రూ. 2.10లక్షలు చోరీ చేసిన వీఆర్ఏ
X

దిశ,రేగోడ్: ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడిన కారణంగా కొందరు నేరాలకు పాల్పడుతూ తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. గౌరవంగా తాము చేసుకుంటున్న పనులను పక్కనబెట్టి తొందరగా డబ్బులను సంపాదించాలన్న అత్యాశతో దొంగతనాలకు సైతం పాల్పడుతూ చివరకు కటకటాలను లెక్కించాల్సి వస్తుంది. తాజాగా మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో ఇదే విధమైన కేసు నమోదు కావడం ఎట్టకేలకు ఆన్ లైన్ గేమ్ ల కోసం దొంగతనం చేసి ఒక వీఆర్ఏ పోలీసులకు చిక్కడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి స్థానిక ఎస్సై రాజయ్య తో కలిసి సోమవారం రేగోడు పోలీస్ స్టేషన్ లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మండల పరిధిలోని మక్త వెంకటాపూర్ గ్రామంలో సంగప్ప అనే వ్యవసాయదారుడు తన వ్యవసాయ సాగు పనుల నిమిత్తం అప్పుగా తెచ్చుకున్న రూ.2.10 లక్షలను ఇంట్లో దాచుకున్నాడు. రోజు మాదిరిగానే వారి ఇంటికి తాళం వేసి తమ కుటుంబీకులతో కలిసి ఈ నెల 24వ తేదీన వ్యవసాయ పనుల కోసం పొలానికి ఆయన కుటుంబీకులు వెళ్లారు.ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన నీరుడి జ్ఞానేశ్వర్ (వీఆర్ఏ)సంగప్ప ఇంటి తాళాన్ని పగులగొట్టి చోరీకి పాల్పడి రూ.2.10 లక్షలను ఎత్తుకెళ్లాడు. తీసుకెళ్లిన మొత్తం డబ్బులను తన భార్యకు ఇచ్చిన జ్ఞానేశ్వర్ తాను ఆన్ లైన్ గేమ్ లో ఆ డబ్బులను సంపాదించానని చెప్పాడని సీఐ తెలిపారు. పెద్ద మొత్తంలో నగదు అపహరణపై బాధితుడు సంగప్ప ఫిర్యాదు మేరకు విచారణ జరిపి నిందితుడు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు.

నిందితుడు జ్ఞానేశ్వర్ సిద్దిపేట జిల్లా చేర్యాలలో వీఆర్ఎగా పని చేస్తూ ఆన్ లైన్ గేమ్ లకు బాగా అలవాటు పడ్డాడని ఇంట్లో కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో డబ్బుల కోసం దొంగతనానికి పాల్పడ్డాడని చెప్పారు. చోరీ చేసిన సొమ్మును కోర్టులో బాధితుడికి అందజేస్తామని నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని తెలిపారు. తమ సిబ్బంది వినోద్, రాంసింగ్, ప్రవీణ్, రవిలు ఈ కేసును నాలుగు రోజుల్లోనే ఛేదించారని వారికి ఎస్పీ ఆదేశాల మేరకు నగదు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు.యువకులు చెడు వ్యసనాలకు దూరంగా జీవించాలని సూచించారు. ప్రజలు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఆన్ లైన్ గేమ్ లు ఆడే వారి సమాచారం తమకు తెలియజేయాలని సీఐ కోరారు.

Advertisement

Next Story

Most Viewed