జర్నలిస్టు దారుణ హత్య: ఉత్తరప్రదేశ్‌లో ఘటన

by samatah |
జర్నలిస్టు దారుణ హత్య: ఉత్తరప్రదేశ్‌లో ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జౌన్‌పూర్ జిల్లాలోని షాహ్‌గంజ్ ప్రాంతంలో ఓ జర్నలిస్ట్‌ను కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సబర్హాద్ గ్రామానికి చెందిన జర్నలిస్టు అశుతోష్ శ్రీవాస్తవ(43) సోమవారం ఇమ్రంగంజ్ మార్కెట్‌కు వెళ్తుండగా..జౌన్‌పూర్-షాగంజ్ రోడ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడి కక్కడే మృతి చెందాడు. అనంతరం స్థానికులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. హత్యకు గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. అయితే ఈ ప్రాంతంలో గోహత్యకు వ్యతిరేకంగా శ్రీవాస్తవ కథనాలు రాస్తున్నారని స్థానిక జర్నలిస్టులు తెలిపారు. స్మగ్లర్ల నుంచి శ్రీవాస్తవకు పలుమార్లు బెదిరింపులు కూడా వచ్చాయని, ఈ విషయాన్ని పోలీసులకు లిఖితపూర్వకంగా తెలియజేసినా పట్టించుకోలేదని తెలిపారు. దీనికి కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల పరిహారం అందించాలని కోరారు. దుండగులను పట్టుకునేందుకు ఒక బృందాన్ని నియమించినట్లు పోలీసు సూపరింటెండెంట్ అజయ్ పాల్ శర్మ తెలిపారు.

Advertisement

Next Story