ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం

by Disha Web Desk 2 |
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం నమోదైంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక బృందం తాజాగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పని చేసిన రాధాకిషన్ రావుతోపాటు సీఐగా పని చేసిన గట్టు మల్లును అదుపులోకి తీసుకుంది. ఈ ఇద్దరిని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ స్వయంగా వీరిని ప్రశ్నిస్తునట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావును జరిపిన విచారణలో రాధాకిషన్ రావు పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పలువురు వ్యాపారులు, హవాలా దందా నడిపిస్తున్నవారు, నగల షాపుల యజమానుల ఫోన్లను ట్యాప్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో ప్రత్యేక బృందం రాధాకిషన్ రావును విచారించాలని భావించింది.

అయితే, ప్రణీత్ రావు అరెస్ట్ కాగానే రాధాకిషన్ రావు విదేశాలకు వెళ్లిపోయారు. దాంతో దర్యాప్తు అధికారులు ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో విచారణకు రావాలంటూ సీఆర్పీసీ 41సెక్షన్ ప్రకారం జారీ చేసిన నోటీసులను రాధాకిషన్ రావు కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి తిరిగి వచ్చిన రాధాకిషన్ రావు పోలీసుల ఎదుట విచారణకు హాజరైనట్టు సమాచారం. ఇక, బెదిరించి డబ్బులు వసూలు చెయ్యటంలో గతంలో టాస్క్ ఫోర్స్ లో సీఐగా పని చేసిన గట్టు మల్లు కీలక పాత్ర పోషించినట్టు తెలియటంతో ఆయనను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు సమాచారం.


Next Story

Most Viewed