రామమందిరంపై ప్రధాని మోడీకి రాష్ట్రపతి లేఖ.. ఏం చెప్పారంటే..

by Hajipasha |
రామమందిరంపై ప్రధాని మోడీకి రాష్ట్రపతి లేఖ.. ఏం చెప్పారంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేఖ రాశారు. రామాలయంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు. ప్రభు శ్రీరాముడు బోధించిన ధైర్యం, పనిపై ఏకాగ్రత, కరుణ వంటి గుణాలు ఈ ఆలయం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతాయని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానికి రాసిన లేఖను ద్రౌపది ముర్ము తన అధికారిక ట్విట్టర్‌(ఎక్స్) ఖాతాలో పోస్ట్ చేశారు. సామాజిక నేపథ్యానికి అతీతంగా మనుషులందరినీ ప్రేమ, గౌరవంతో చూడాలనే గొప్ప సందేశాన్ని ప్రభు శ్రీరాముడు అందించారని ముర్ము పేర్కొన్నారు. శ్రీరాముడు అయోధ్య ప్రజలకు న్యాయం, సంక్షేమం అందించేందుకు ఎంతో కృషి చేశారని, ఇది ప్రస్తుతం మన దేశ పరిపాలనలో కనిపిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. రామమందిరం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం గత 11 రోజులుగా ప్రధాని మోడీ పాటిస్తున్న నిష్ట గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మీరు చేపట్టిన 11 రోజుల అనుష్ఠానం ఒక పవిత్రమైన ఆచారం మాత్రమే కాదు.. ప్రభు శ్రీరాముడి పట్ల మీ త్యాగనిరతికి, సమర్పణకు అద్దంపట్టే అత్యున్నత ఆధ్యాత్మిక చర్య’’ అని భారత రాష్ట్రపతి కొనియాడారు. భారత జాతిపిత మహాత్మా గాంధీజీ తుదిశ్వాస వరకు కూడా రామనామంతోనే శక్తిని పొందారని చెప్పారు. ‘‘రామనామమే సత్యం. ఎన్నో చీకటి సమయాల్లో, కష్ట కాలాల్లో ఆ రామనామమే నన్ను రక్షించింది. ఇప్పటికీ నన్ను రక్షిస్తోంది’’ అని గాంధీజీ చెప్పేవారన్నారు.

Advertisement

Next Story