రామమందిరానికి విరాళాలిచ్చిన ఐదుగురు సినీ ప్రముఖులు

by Hajipasha |
రామమందిరానికి విరాళాలిచ్చిన ఐదుగురు సినీ ప్రముఖులు
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామ మందిరం సోమవారం ప్రారంభం కాబోతోంది. రామ మందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1,100 కోట్లకుపైగా ఖర్చయింది. మిగిలిన పనులు పూర్తి కావడానికి మరో రూ.300 కోట్లు అవసరమవుతాయని అంటున్నారు. ఇప్పటివరకు ఆలయ నిర్మాణానికి పెద్దఎత్తున భక్తుల నుంచి విరాళాలు వచ్చాయి. విరాళాలు ఇచ్చిన పలువురు సినీ పరిశ్రమ ప్రముఖుల వివరాలు చూద్దాం..

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్ 2021 జనవరిలో ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తనవంతుగా సాయం చేయడం మొదలుపెట్టానని ఆయన వెల్లడించారు. అందరూ ఎవరి వంతుగా వారు ఈ మహా క్రతువులో చేరాలని పిలుపునిచ్చారు. ‘‘అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణం ప్రారంభం కావడం చాలా సంతోషకరమైన విషయం. జై సియారాం’’ అని అక్షయ్ కామెంట్ చేశారు.

అనుపమ్ ఖేర్

అనుపమ్ ఖేర్ 2023 అక్టోబర్ 2న అయోధ్యను సందర్శించినప్పుడు ఒక వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. రామాలయ నిర్మాణ స్థలంలో తాను రికార్డ్ చేసిన ఒక వీడియో క్లిప్‌ను ఆయన షేర్ చేశారు. ‘‘మిత్రులారా! అయోధ్య రామమందిరాన్ని మీకు చూపిస్తున్నాను. ఈ భారీ ఆలయాన్ని చూడటం ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తోంది. ఈ ఆలయం ఎప్పుడు సిద్ధమవుతుందా అని ప్రతి భక్తుడు ఎదురుచూస్తున్నాడు. జై శ్రీరామ్ నినాదం అయోధ్య వాతావరణంలో ప్రతిధ్వనిస్తోంది. నా తరఫున ఈ ఆలయానికి ఇటుకను కానుకగా ఇచ్చాను. నేను ఆశీర్వదించబడ్డాను’’ అని అనుపమ్ ఖేర్ వీడియోలో చెప్పుకొచ్చారు.

ముఖేష్ ఖన్నా

శక్తిమాన్‌గా పేరొందిన ముఖేష్ ఖన్నా 2021 ఫిబ్రవరిలో రామాలయ నిర్మాణానికి రూ. 1.1 లక్షల చెక్కును అందజేశారు. తమ ప్రాంత ఎమ్మెల్యే అతుల్ భత్ఖల్కర్‌కు దీన్ని అందించారు. ఈ ఫొటోతో అప్పట్లో ఆయన ఒక ట్వీట్‌ చేశారు. రామమందిర నిర్మాణానికి నేను సైతం అంటూ నిలబడినందుకు సంతోషంగా ఉందని ముఖేష్ ఖన్నా తన పోస్టులో ప్రస్తావించారు.

పవన్ కళ్యాణ్

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ రూ. 30 లక్షల విరాళం ఇచ్చారు . “శ్రీరామచంద్ర భగవానుడు ధర్మానికి ప్రతిరూపం. ఆయన చూపిన సహనం, త్యాగం, ధైర్యసాహసాలు అందరికీ స్ఫూర్తి. శ్రీరాముడు సృష్టించిన మార్గం కారణంగా భారతదేశం అనేక దాడులను తట్టుకుంది. అందుకే అలాంటి ధర్మానికి ప్రతిరూపమైన అయోధ్యలో ఆలయ నిర్మాణానికి సంఘీభావం తెలపడం అందరి బాధ్యత. రామ మందిర నిర్మాణానికి నా వంతుగా 30 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నాను. నా విరాళం గురించి విన్న నా వ్యక్తిగత సిబ్బంది.. హిందువులు మాత్రమే కాకుండా ముస్లింలు, క్రైస్తవులు కూడా విరాళం ఇచ్చేందుకు 11,000 రూపాయలను సేకరించారు’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

హేమ మాలిని

అయోధ్య రామమందిర నిర్మాణానికి హేమ మాలిని కూడా విరాళం ఇచ్చారు. అయితే అది ఎంత మొత్తమో ఆమె వెల్లడించలేదు. ఆమె ఇటీవల అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా మీడియాతో హేమ మాలిని మాట్లాడుతూ.. “నేను మొదటిసారి అయోధ్యకు వచ్చాను. ఇక్కడ అంతా రామమయం అన్నట్టుగా అనిపిస్తోంది. గతేడాది నేను రామ్ భజన పాడాను. అందరూ రాముడి కోసం అన్నీ సిద్ధం చేస్తున్నారు’’ అని చెప్పారు.

Advertisement

Next Story