- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంఫాన్ బీభత్సం.. 84 మంది మృతి
కోల్‌కతా: ఎంఫాన్ ప్రచండ తుపాను బెంగాల్‌లో విధ్వంసం సృష్టించింది. పశ్చిమ బెంగాల్‌లోని డిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో బుధవారం సాయంత్రం తీరం దాటిన ఎంఫాన్.. బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌లలో తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ సూపర్ సైక్లోన్ ధాటికి బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌లో మొత్తం 84 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఒక్క బెంగాల్‌లోనే 72మంది మృతిచెందగా, ఒడిశాలో ఇద్దరు, బంగ్లాదేశ్‌లో 10మంది చనిపోయారు. ఇందులో అత్యధిక మరణాలు చెట్లు, ఇంటి గోడలు కూలిపోవడం వల్లే సంభవించాయి. గత రెండు దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన ఈ తుపాన్ ధాటికి బెంగాల్ రాజధాని కోల్‌కతా, హౌరా, మిడ్నాపూర్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ సహా అనేక పట్టణాలు చిగురాటుకులా వణికిపోయాయి. గంటకు 185కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు వేలాది వృక్షాలు కూకటి వేళ్లతో సహా నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. రవాణా వ్యవస్థ, విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. వందలాది ఇండ్లు కూలిపోయాయి. జనజీవనం మొత్తం అస్తవ్యస్తమైంది.
మునిగిన కోల్‌కతా ఎయిర్‌పోర్ట్
ఎంఫాన్ సూపర్ సైక్లోన్ వల్ల కురిసిన అతిభారీ వర్షానికి కోల్‌కతా విమానాశ్రయం నీట మునిగింది. దీంతో కార్గో సేవలు నిలిచిపోయాయి. బలమైన ఈదురు గాలులతో ఎయిర్‌పోర్టులో పలు నిర్మాణాలు విరిగిపడి కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇంతటి విధ్వంసాన్ని జీవితంలోనే చూడలేదు: సీఎం మమతా
ఇంతటి భారీ బీభత్సాన్ని తన జీవితంలోనే చూడలేదని సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని స్వయంగా అంచనా వేసేందుకు ప్రధాని మోడీని రాష్ట్రంలో పర్యటించాలని కోరినట్టు తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు వెల్లడించారు. ప్రాణం, ఆస్థి నష్టం ఇంకా పెరగొచ్చని, కావున మూడు నుంచి నాలుగు రోజుల వరకు నష్టపరిహారాన్ని అంచనా వేయలేమని చెప్పారు. ప్రస్తుతానికి మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ భేటీ
ఎంఫాన్ తుపాన్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి గురువారం సమావేశం నిర్వహించినట్టు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్.ఎన్ ప్రధాన్ తెలిపారు. ఈ మీటింగ్‌లో బెంగాల్, ఒడిశా ప్రధాన కార్యదర్శులు పాల్గొని, తమ తమ రాష్ట్రాల్లో పునరుద్ధరణకు అవసరమైన సహాయాలను కోరినట్టు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల్లో పరిస్థితిని అదుపులోకి తేవడానికి ఇప్పటికే సహాయక బృందాలను రంగంలోకి దింపామని ప్రధాన్ వెల్లడించారు. రెండు రాష్ట్రాలతో పోల్చుకుంటే బెంగాల్‌లో తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉందని, దీంతో సీఎం మమతా అదనంగా మరో నాలుగు సహాయక బృందాలను పంపాలని కోరినట్టు వెల్లడించారు. ఇందుకు కేబినెట్ సెక్రెటరీ నుంచి వెంటనే ఆమోదం లభించిందని తెలిపారు. అలాగే, ఇరు రాష్ట్రాల్లో ఒకటి రెండు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు.
7 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
సూపర్ సైక్లోన్ ప్రభావానికి గురయ్యే ప్రాంతాల నుంచి ముందు జాగ్రత్త చర్యగా ఏడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ప్రధాన్ వెల్లడించారు. వీరిలో బెంగాల్ నుంచి 5 లక్షల మంది ఉండగా, ఒడిశా నుంచి 2.3 లక్షల మంది ఉన్నట్టు తెలిపారు.
అస్సాం, మేఘాలయాలకు హెచ్చరిక
బెంగాల్‌లో తుపాన్ తీవ్రత తగ్గిపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కొనసాగనుండగా, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరించింది. అలాగే, గంటకు 50 నుంచి 60కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది.
పరిస్థితులు చక్కబడాలని ప్రార్థిస్తున్నా: ప్రధాని
ఎంఫాన్ బీభత్సంపై ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇరు రాష్ట్రాల్లోనూ సైక్లోన్ సృష్టించిన కల్లోలాన్ని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నట్టు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి సంబంధిత అధికారులంతా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని వెల్లడించారు. సవాళ్లతో కూడుకున్న ఈ సమయంలో యావత్ దేశం సంఘీభావం ప్రకటిస్తోందని వెల్లడించారు. పరిస్థితులు వీలైనంత తొందరగా చక్కబడాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లో 10లక్షల మంది చీకట్లోనే..
తుపాన్ ధాటికి దేశంలోని తీరప్రాంతాల్లో ఇప్పటివరకు 10 మంది మృతిచెందారు. ప్రభావిత ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సుమారు 10 లక్షల మంది చీకట్లోనే గడుపుతున్నారని దేశ విద్యుత్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. అలలు ఎగిసిపడటంతో వందలాది తీరప్రాంత గ్రామాల్లోకి నీరు చేరిందని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.