లింక్డ్ఇన్ 500 మిలియన్ యూజర్ల డేటా లీక్?

by Harish |
లింక్డ్ఇన్ 500 మిలియన్ యూజర్ల డేటా లీక్?
X

దిశ, ఫీచర్స్ : యూజర్ డేటాకు భద్రత లేకుండాపోతోందని ఇదివరకే చెప్పుకున్నాం. ఇటీవలే ఫేస్‌బుక్‌కు చెందిన 533 మిలియన్లకు పైగా యూజర్ డేటా ఓపెన్ మార్కెట్‌లో లీక్ అయిందనే విషయం బయటికి రాగా.. ఈ డేటా బ్రీచ్ ఇప్పటిది కాదని, 2019కి చెందినదని ఎఫ్‌బీ పేర్కొంది. ఇదిలా ఉంటే, తాజాగా లింక్డ్ఇన్ యూజర్ల డేటా లీక్ అయింది. దాదాపు 500 మిలియన్లకు పైగా యూజర్ల డేటా హ్యాకర్ల చేతికి చిక్కిందని సైబర్ న్యూస్ చెబుతోంది. కాగా లింక్డ్ఇన్ వెబ్‌సైట్ ప్రకారం 675 మిలియన్లకు పైగా సభ్యులను కలిగి ఉంది.

500 మిలియన్ల లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ సమాచారాన్ని ఒక ప్రముఖ హ్యాకర్ ఫోరమ్‌లో అమ్మకానికి ఉంచారని సైబర్ న్యూస్ పేర్కొంది. ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్‌గా హ్యాకర్లు సుమారు 2 మిలియన్ రికార్డులను ఆ ఫోరమ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. పూర్తి పేర్లు, ఇమెయిల్, ఇంటి చిరునామాలు, ఫోన్ నంబర్లు, కార్యాలయ సమాచారం వంటి మరిన్ని విశేషాలు కలిగి ఉన్న డేటాను హ్యాకర్లు స్క్రాప్ చేసినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఈ విషయం తెలుసుకున్న లింక్డ్ఇన్ డేటాపై ఒక ప్రకటన విడుదల చేసింది.

‘ఆరోపించిన సెట్’‌ను పరిశోధించాం. ఇది వాస్తవానికి అనేక వెబ్‌సైట్‌లు, కంపెనీల నుంచి సేకరించిన డేటా. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని ప్రొఫెషనల్ సోషల్ మీడియా సైట్ ప్రొఫైల్స్‌లో బహిరంగంగా జాబితా చేసిన సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంది. ఇది లింక్డ్ఇన్ డేటా ఉల్లంఘన కాదు. మా నుంచి ప్రైవేట్ సభ్యుల ఖాతాలకు సంబంధించిన డేటా ఏదీ లీక్ కాలేదు. ఎవరైనా సభ్యులు మా డేటాను తస్కరించి లింక్డ్ఇన్ సభ్యులు అంగీకరించని ప్రయోజనాల కోసం ఉపయోగించటానికి ప్రయత్నించినప్పుడు, మేము వాటిని ఆపి జవాబుదారీగా ఉంచడానికి కృషి చేస్తాము’ అని లింక్డ్ఇన్ ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed