365 రోజుల లైవ్ స్ట్రీమ్.. అవి కూడా!

by Harish |
365 రోజుల లైవ్ స్ట్రీమ్.. అవి కూడా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో సెలెబ్రిటీలు, క్రియేటర్స్ తమ అభిమానుల కోసం లైవ్‌స్ట్రీమ్‌లు పెడుతుంటారు. ఈ లైవ్‌స్ట్రీమ్‌లు గంట నుంచి నాలుగు గంటలు లేదంటే 10 గంటల వరకు సాగుతుంటాయి. కానీ ఏకంగా 365 రోజులు సాగిన లైవ్‌స్ట్రీమ్ గురించి మీకు తెలుసా? అమెరికాకు చెందిన మైకేల్ గెర్రీ ఆ పని చేశాడు. ఒక సంవత్సరం మొత్తం లైవ్‌స్ట్రీమ్ నిర్వహించాడు. అది ఒక గోల్‌గా పెట్టుకుని ముందుకు సాగాడు. నిజానికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మైకేల్ గెర్రీ, లైవ్ స్ట్రీమ్ కారణంగానే బతికాడు. ఇంకా చాలా మారిపోయాడు. ఇంతకీ అతను ఎందుకు చనిపోవాలనుకున్నాడు? లైవ్ స్ట్రీమ్‌లో ఏం చూపించాడు? మైకేల్‌లో వచ్చిన మార్పు ఏంటి?

కాలేజీ విద్య మైకేల్‌కు అచ్చి రాలేదు, అందుకే డ్రాప్ అయ్యాడు. కానీ తర్వాత ఏం చేయాలో తెలియలేదు, చేతిలో చిల్లి గవ్వ లేదు. జీవితానికి ఒక లక్ష్యం, ధ్యేయం లేకుండా తిరుగుతున్నాడు. అలా బతకడం మైకేల్‌కు నచ్చలేదు. ఇక చేసేది లేక ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే మైకేల్‌కు ఒక వీడియో కనిపించింది. అరియా ఇంతావాంగ్ అనే మహిళ చేసిన వీడియో అది. ఆమె వారం రోజుల పాటు తన జీవితాన్ని ఇంటర్నెట్‌లో లైవ్ స్ట్రీమ్ చేసింది. దాన్ని ఆదర్శంగా తీసుకుని తాను కూడా ఒక లైవ్ స్ట్రీమ్ చేద్దామని మైకేల్ నిర్ణయించుకున్నాడు.

‘లైఫ్ స్ట్రీమ్’ అని పేరు పెట్టి సంవత్సరం పాటు ప్రతిరోజూ తన జీవితాన్ని స్ట్రీమ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 2019న తన బెడ్‌రూమ్, కంప్యూటర్ దగ్గర, అతని భుజం మీద కెమెరాలు అమర్చుకున్నాడు. తాను ఉన్న ప్రదేశాన్ని, కలిసి ఉన్న వ్యక్తులను బట్టి కెమెరాలను ఆన్ చేస్తూ, ఆ మూడింటిలో ఏదో ఒక కెమెరా నిరంతరం లైవ్ స్ట్రీమ్ చేస్తుండేలా చూసుకున్నాడు. జీవితంలో ఎలాంటి బ్రేకులు లేకుండా ప్రతి అంశాన్ని లైవ్ స్ట్రీమ్ చేశాడు. తినడం, డేటింగ్, స్నేహితులతో తిరగడం, పార్టీలు చేయడం, గొడవలు పడటం, పక్కింటి వాళ్లతో గొడవ పడటం ఇలా అన్ని రకాల సంఘటనలను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా లైవ్ స్ట్రీమ్ చేశాడు.

ఇలా ఎందుకు చేశావని ఎవరన్నా అడిగితే.. ‘ఆసక్తిగా అనిపించింది చేశాను’ అని మైకేల్ సమాధానమిస్తున్నాడు. అయితే ఈ లైఫ్ స్ట్రీమ్ వల్ల తన జీవితంలో చాలా మార్పులొచ్చాయని చెబుతున్నాడు. తన జీవితాన్ని తాను లైవ్ స్ట్రీమ్‌లో చూసుకుని ఆల్కహాల్, కాఫీ వంటి ఇతర అలవాట్లను మానుకున్నట్లు తెలిపాడు. లైఫ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసిన ఐదు నెలల్లోనే తాను హెల్తీ ఫుడ్ తినడం అలవాటు చేసుకున్నానని, వ్యాయామం కూడా చేస్తున్నట్లు చెప్పాడు. ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తన అభిప్రాయాన్ని ఇప్పుడు పూర్తిగా మార్చుకుని జీవితం మీద ఆశ పెంచుకోవడానికి ఈ లైఫ్ స్ట్రీమ్ ఉపయోగపడిందని అన్నాడు. అందుకే చివరి మూడు నెలల్లో తన ప్రైవేట్ విషయాలను కూడా లైఫ్ స్ట్రీమ్‌లో భాగం చేసినట్లు మైకేల్ పేర్కొన్నాడు. ఈ లైవ్ స్ట్రీమ్ ద్వారా మైకేల్ అక్కడ చిన్నపాటి సెలెబ్రిటీ అయ్యాడు. ప్రస్తుతం ఇలాంటి లైవ్ స్ట్రీమ్‌లు ఎలా చేయాలో సూచనలు చెబుతూ ఒక బుక్ కూడా రాస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed