36 మంది విద్యార్థినుల‌కు క‌రోనా పాజిటివ్

by Shiva |
36 మంది విద్యార్థినుల‌కు క‌రోనా పాజిటివ్
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: క‌రోనా మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చినా చాప‌కింద నీరులా విస్తరిస్తోంది. హైద‌రాబాద్ ఎల్బీ నగర్ నాగోల్ బండ్లగూడాలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్‌లో సుమారు 36 మంది విద్యార్థినులు కరోనా బారిన ప‌డ్డారు. దీంతో పాఠ‌శాల‌లో చ‌దువుతున్న విద్యార్థినుల‌తో పాటు ప‌ని చేస్తున్న సిబ్బంది ఆందోళ‌న‌కు గుర‌య్యారు. బండల్‌గూడ మైనార్టీ రెసిడెన్సియ‌ల్ బాలిక‌ల పాఠ‌శాల‌లో మొత్తం 183 మంది విద్యార్థినులు చదువుతున్నారు . వీరిలో కొంత‌మందికి కరోనా ల‌క్షణాలు క‌న్పించ‌డంతో మంగ‌ళ‌వారం వైద్యులు వారికి ప‌రీక్షలు నిర్వహించగా.. 36 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో పాటు త‌ల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కి ప‌డ్డారు. పాజిటివ్ వ‌చ్చిన విద్యార్థినులకు ఆస్పత్రిలో చేర్చి వైద్య చికిత్స అందిస్తుండ‌గా.. ఇత‌ర విద్యార్థుల‌ను త‌ల్లిదండ్రులు ఇళ్లకు తీసుకువెళ్తున్నారు.

నాగోలు బండల్‌గూడలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్‌లో చ‌దువుతున్న విద్యార్థినులు క‌రోనా బారిన ప‌డిన‌ట్లు డైరెక్టర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ డాక్టర్ జీ శ్రీనివాస‌రావు ధృవీక‌రించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న దిశ ప్రతినిధితో మాట్లాడారు. విద్యార్థినులకు క‌రోనా ల‌క్షణాలు క‌న్పించ‌డంతో.. వారికి పరీక్షలు నిర్వహించగా.. 36 మందికి పాజిటివ్ అని తేలింద‌న్నారు . దీంతో మిగిలిన విద్యార్థినుల‌ను సుర‌క్షితంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. పాఠ‌శాల ప్రాంగ‌ణం మొత్తాన్ని శానిటైజేష‌న్ చేయ‌డంతో పాటు మూసివేశామ‌ని, మిగిలిన విద్యార్థినుల‌కు ప్రత్యామ్నాయ ఏర్పా‌ట్లు చేయ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న వివ‌రించారు .

Advertisement

Next Story

Most Viewed