తెలంగాణలో మరో 30 మందికి కరోనా పాజిటివ్..

by vinod kumar |
తెలంగాణలో మరో 30 మందికి కరోనా పాజిటివ్..
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో సోమవారం కొత్తగా 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం సంఖ్య 364కు చేరుకుంది. ఇప్పటివరకూ 35 మంది డిశ్చార్జి అయ్యారు. పదకొండు మంది చనిపోయారు. దీంతో ప్రస్తుతం 318 మంది యాక్టివ్ పాజిటివ్ పేషెంట్లు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం 364 పాజిటివ్ పేషెంట్లలో యాభై మంది మాత్రమే విదేశాల నుంచి వైరస్ మోసుకొచ్చినవారు, వారి ద్వారా సోకినవారు. మిగిలిన 314 మందీ మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారు, వారి ద్వారా సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులు గురైనవారు, వీరి ద్వారా ఇతరులకు అంటినవారు. చనిపోయిన పదకొండు మందీ మర్కజ్‌తో సంబంధం ఉన్నవారే. నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారు 1089 మందిగా లెక్క తేలిందని, ఇంకో 35మంది వివరాలు తెలియాల్సి ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. 1089 మంది ద్వారా సుమారు 170 మందికా పాజిటివ్ సోకిందన్నారు. ఇంకా 600 మందికి సంబంధించిన వైద్య పరీక్షల రిపోర్టు రావాల్సి ఉంది. ఇందులో సుమారు 170 మందికి పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. బహుశా అక్కడితో పాజిటివ్ కేసులు ఆగిపోతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే థర్డ్ లెవల్‌లో ఎవరికైనా కరోనా వ్యాధి లక్షణాలు సోకి ఉంటే అవి పాజిటివ్‌గా మారే అవకాశం ఉంటుంది తప్ప ఇప్పటికింకా అలాంటివి వెలుగులోకి రాలేదని సీఎం వ్యాఖ్యానించారు. క్వారంటైన్‌లో ఉన్న 25,937 మందిలో 250 మంది మినహా మిగిలినవారంతా ఇళ్ళకు వెళ్ళిపోయారని, వీరు కూడా బుధవారంకల్లా వెళ్లిపోతారన్నారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు చికిత్స అందుతున్నా ఇకపైన అవన్నీ గాంధీ ఆసుపత్రికే వస్తాయని, కొత్త కేసులు నమోదైనా అవి అక్కడికే వెళ్తాయని, పూర్తి స్థాయిలో కరోనా కోసమే గాంధీ ఆసుపత్రి పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు.

మొత్తం కేసులు : 364
మృతులు : 11
డిశ్చార్జి అయినవారు : 35
యాక్టివ్ పాజిటివ్ కేసులు : 318

Advertisement

Next Story

Most Viewed