ICC World Cup 2023: బంగ్లాదేశ్‌‌పై ఇంగ్లండ్ విజయం..

by Vinod kumar |   ( Updated:2023-10-10 13:17:04.0  )
ICC World Cup 2023: బంగ్లాదేశ్‌‌పై ఇంగ్లండ్ విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 137 పరుగులతో గెలిచింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 364 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 48.2 ఓవర్‌లకు 227 రన్స్ చేసి ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్స్‌లో.. లిట్టన్ దాస్ (77), ముష్ఫికర్ రహీమ్ (51), తౌహిద్ హృదయ్ (39) పరుగులతో రాణించారు. కానీ మిగిలిన బ్యాటర్స్‌ విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్‌లో.. రీస్ టోప్లీ 4, క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా.. సామ్ కర్రాన్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్‌స్టోన్ చెరో వికెట్ తీశారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ పరుగుల వరద పారించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌కు 365 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్‌లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్‌ మలాన్‌ ఇంగ్లండ్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి 115 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ దశలో షకీబ్‌ ఉల్ హసన్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టో (52; 8 ఫోర్‌లు) క్లీన్‌ బౌల్డయ్యాడు. తర్వాత జోయ్‌ రూట్‌ వన్‌ డౌన్‌గా వచ్చి డేవిడ్‌ మలాన్‌కు జత కలిశాడు. ఈ ఇద్దరు కూడా 151 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత మెహదీ హసన్‌ బౌలింగ్‌లో మరో సెంచరీ హీరో డేవిడ్‌ మలాన్‌ (140; 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) బౌల్డ్‌ అయ్యాడు.

అప్పటికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 2 వికెట్ల నష్టానికి 266 పరుగులు. ఆ తర్వాత భారీ స్కోర్‌ నమోదు చేసే ప్రయత్నంలో బాదుడే పనిగా పెట్టుకుని ఇంగ్లండ్‌ బ్యాటర్‌లు వెంటవెంటనే వికెట్లు పారేసుకున్నారు. జోయ్‌ రూట్‌ (68; 8 ఫోర్‌లు, 1 సిక్సర్‌) నాలుగో వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు. షొరీఫుల్‌ ఇస్లామ్‌ బౌలింగ్‌లో ముష్ఫికర్‌ రహీమ్‌కు క్యాచ్‌ ఇచ్చి రూట్‌ ఔటయ్యాడు. నిర్ణీత 50 ఓవర్ల ఆట ముగిసేటప్పటికీ ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్‌లలో మెహదీ హసన్‌ 4 వికెట్లు, షొరీఫుల్‌ ఇస్లామ్‌ 3 వికెట్లు తీశారు.

Advertisement

Next Story

Most Viewed