ఫ్యాషన్ పరిశ్రమలో 15 శాతం బట్టలు వృథా

by Shyam |
ఫ్యాషన్ పరిశ్రమలో 15 శాతం బట్టలు వృథా
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ ఫ్యాషన్ పరిశ్రమ ఉపయోగించే మొత్తం ఫాబ్రిక్ లో సుమారు 15 శాతం వృథా అవుతోందని పరిశోధకురాలు, మలై బయోమెటీరియల్స్ కోఫౌండర్ జుజానా గొంబోసోవా అన్నారు. ప్రతి సంవత్సరం 5,00000 టన్నుల మైక్రోఫైబర్లను సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అది 50 బిలియన్ ప్లాస్టిక్ సీసాలకు సమానమన్నారు. ఫ్యాషన్ నుంచి సంవత్సరానికి 92 మిలియన్ టన్నుల వ్యర్థాలు సృష్టించబడుతున్నాయన్నారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఇంక్యుబేషన్, ఐ-టీఐసీ ఫౌండేషన్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్(టిబిఐ), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ హైదరాబాద్) సంయుక్తంగా నాలెడ్జ్ ల్యాబ్‌ను నిర్వహించాయి. సస్టైనెబుల్ లివింగ్ ఇన్ ది న్యూ నార్మల్, జ్యువెలరీ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీస్‌లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం విన్నింగ్ స్ట్రాటజీస్ అనే అంశంపైన ఆమె మాట్లాడారు. ప్రపంచ కార్బన్ ఉద్గారాలలో దుస్తులు పరిశ్రమ 10 శాతం వాటా కలిగి ఉందన్నారు. గ్లోబల్ ఫ్యాషన్ పరిశ్రమలో ఉత్పత్తి, తయారీ, ట్రాన్స్ సమయంలో ఉపయోగించిన శక్తి కారణంగా చాలా గ్రీన్హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తోందన్నారు. కస్టమర్లతో నిరంతరం సత్సంబంధాల కోసం వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి, ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలు, ఆకర్షణీయమైన వర్చువల్ స్టోర్లు, యూజర్ ఫ్రెండ్లీ అనుభవాలను ఎలా సృష్టించాలి, ఆన్‌లైన్ ఉనికి కోసం సోషల్ మీడియా మార్కెటింగ్ వ్యూహాలను ఎలా ఉపయోగించాలి అన్న అంశాలపై మాట్లాడారు.

ఆమె గత సంవత్సరం లాక్మే ఫ్యాషన్ వీక్ (ఎల్‌ఎఫ్‌డబ్ల్యు) లో సర్క్యులర్ డిజైన్ ఛాలెంజ్ (సిడిసి) రెండో ఎడిషన్‌ను గెలుచుకున్నారు. మలై బయోమెటీరియల్స్ కొబ్బరి నీరు, అరటి ఫైబర్ వంటి ముడి పదార్థాలను ఉపయోగించి తోలులా కనిపించే నీటి-నిరోధక బయో-మిశ్రమ పదార్థాన్ని తయారు చేశారు. కార్యక్రమంలో పాన్-ఇండియా ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ సభ్యులు, ఐఐటీహెచ్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed