బాడుగకు ‘బీఎస్ఎన్ఎల్’!

by Harish |
బాడుగకు ‘బీఎస్ఎన్ఎల్’!
X

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) బిజినెస్ స్టైల్‌ మార్చింది. ఈ నెలాఖరుతో పెద్ద ఎత్తున బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో సంస్థ భవనాలు సగం వరకూ ఖాళీ అవనున్నాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు బీఎస్ఎన్ఎల్ సంస్థ సొంత భవనాలను బాడుగకు ఇవ్వనుంది. హైదరాబాద్‌లో బీఎస్ఎన్ఎల్‌కు వేర్వేరు ప్రాంతాల్లో భవనాలున్నాయి. ఈ నెలాఖరు తర్వాత ఇప్పటికే ఖాళీగా ఉన్న భవనాలకు తోడు మరిన్ని భవనాలు ఖాళీగా మారనున్నాయి. దీంతో ఇప్పటికే కోల్పోతున్న ఆదాయానికి తోడు భవనాలు బోసిపోయి పాతబడకుండా ఉండేందుకు అద్దెకిచ్చేలా సంస్థ నిర్ణయించింది.

సంస్థకు చెందిన ఈ క్వార్టర్‌లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులకు అద్దెకిచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతానికి అద్దెకిచ్చిన భవనాల ద్వారా నెలకు రూ. 55 లక్షల వరకూ ఆదాయం సమకూరుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్‌కు హైదరాబాద్ పరిధిలో ఖైరతాబాద్, బంజారాహిల్స్, సరూర్‌నగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్, సైనిక్‌పురి సహా ఇతర ప్రాంతాల్లో నివాస సముదాయాలున్నాయి. మొత్తం 1,392 ఇళ్లుండగా సుమారు 400 వరకూ ఖళీగానే ఉన్నాయి. వీటి విస్తీర్ణం 600 చదరపు అడుగుల నుంచి మొదలు 2,000 చదరపు అడుగులు వరకూ ఉన్నాయి. వీటి అద్దె కూడా ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.6,000 నుంచి రూ. 25,000 వరకూ ఉన్నాయి. మిగిలిన సముదాయలను కూడా అద్దెకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్ పరిధిలో బీఎస్ఎన్ఎల్‌కు ప్రధాన ప్రాంతాల్లో కార్యాలయాలు, టెలిఫోన్ ఎక్స్ఛేంజీలున్నాయి. చాలావరకూ వీటిలో ఖాళీగా ఉన్నాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ భవనంలోని 8,9వ అంతస్తులను ఇప్పటికే జీఎస్టీకి అద్దెకిచ్చారు. ఈ నెలాఖరు తర్వాత ఈ భవనంలోని 3, 4 అంతస్తులు ఖాళీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ భవనంలోని మిగిలిన ఉద్యోగులను లక్డీకాపూల్‌లోని టెలిఫోన్ భవన్‌కుగానీ, నాంపల్లిలోని దూరసంచార్ భవన్‌కుగానీ తరలించే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉన్న కొంతమందిని వేరే భవనానికి మారిస్తే ఈ భవనం మొత్తాన్ని అద్దెకివ్వచ్చని అధికారులు అంటున్నారు. ఈ భవనం విస్తీర్ణం సుమారు లక్ష చదరపు అడుగులు ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో చదరపు అడుగు రూ.84 వరకూ అద్దె వసూలు చేస్తున్నారు. అలాగే, మాదాపూర్, లింగంపల్లి, నాచారం, తిరుమలగిరి ప్రాంతాల్లోనూ సుమారు 35 వేల చదరపు అడుగుల వరకూ బీఎస్ఎన్ఎల్ భవనాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకూ, రూ. 25 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి సంస్థలకూ ఈ భవనాలను అద్దెకు లేదంటే లీజుకు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, వేరే టెలికాం సంస్థలకు మాత్రం ఈ భవనాలను అద్దెకివ్వరు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 350 ఎక్స్ఛేంజీ భవనాలను అద్దెకు ఇవ్వనున్నారు.

కేంద్రం ఇటీవల 50 ఏళ్లు దాటిన ఉద్యోగులకు వీఆర్ఎస్ అవకాశం ఇవ్వడంతో ఈ నెలాఖరులో సుమారు 2,600 మంది స్వచ్చంద పదవీ విరమణ చేయనున్నారు. హైదరాబద్ పరిధిలో ప్రస్తుతం 3,700 మంది ఉద్యోగులున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్త 8,080 మంది ఉద్యోగులున్నారు. వీరిలో దాదాపు 4,800 మంది వీఆర్ఎస్ ద్వారా ఉద్యోగాన్ని వీడనున్నారు.

Advertisement

Next Story

Most Viewed