- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుది దశకు జోనల్ కేటాయింపు.. ఏప్రిల్ తర్వాతే పోస్టింగ్!
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల జోనల్ కేటాయింపుల ప్రక్రియ తుది దశకు చేరుతోంది. కానీ పోస్టింగ్ ఆర్డర్లు ఎప్పుడు ఇస్తారనే సందిగ్ధత తొలగడం లేదు. ఇప్పటికే ఏండ్ల తరబడి ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులు బదిలీలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం జోనల్ కేటాయింపులను సాకుగా చూపిస్తూ వాయిదా వేస్తూనే ఉంది. ప్రస్తుతం జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేటాయింపులు జరుగుతున్నాయి. జిల్లా స్థాయి ఉద్యోగులకు అలాట్మెంట్ ఆర్డర్లు జారీ అయ్యాయి. కానీ జిల్లా స్థాయిల్లోని అధికారులు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. నూతన జిల్లాల కేటాయింపు ఉత్తర్వులను జిల్లా ఖజానా కార్యాలయాల నుంచి తీసుకోవాలని, కేవలం కేటాయింపు ఉత్తర్వులు మాత్రమే ఇస్తారని, కానీ ప్రస్తుతం ఉన్నచోటు నుంచి రిలీవ్ చేయడం, కొత్త జిల్లాల్లో చేర్చుకోవడం కుదరదని, తదుపరి ఉత్తర్వులు విడుదల చేసేంత వరకు ప్రస్తుత స్థానాల్లోనే పని చేయాలంటూ సర్క్యులర్ జారీ చేశారు. దీంతో పోస్టింగ్‌లపై మళ్లీ తెగని పంచాయతీ మొదలైంది.
ఏప్రిల్‌లో ఉంటాయా..?
ఇప్పుడు జిల్లా, జోనల్ కేటాయింపుల ప్రకారం పని చేస్తున్న ప్రాంతం నుంచి రిలీవ్ చేయమంటూ ప్రభుత్వం తరపున తేల్చి చెప్పారు. అంటే ఉద్యోగులు కేవలం తమ జిల్లాల కేటాయింపులకే పరిమితమవుతున్నారు. కానీ బదిలీలు, పోస్టింగ్‌లు ఎప్పుడు అనేదానిపై ఎక్కడా క్లారిటీ లేదు. దీంతో ఉద్యోగులకు కొత్త జిల్లాలు, కొత్త స్థానాలు కేటాయించినప్పటికీ.. పోస్టింగ్ మాత్రం ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది. అయితే ప్రస్తుత సంవత్సరం మధ్యలో బదిలీలు ఉండవని, ఇప్పటికిప్పుడు బదిలీ చేస్తే కొత్త జిల్లాలకు వెళ్లడం, అక్కడ ఇండ్లు, పాఠశాలలు సర్దుబాటు చేసుకోవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని శాఖల ఉన్నతాధికారులు కూడా దీన్ని సమర్ధిస్తున్నారు. ఇప్పుడు బదిలీల ప్రక్రియ చేపట్టితే మళ్లీ చాలా అవాంతరాలు ఏర్పడుతాయని భావిస్తున్నారు. ఇప్పటికీ కూడా పోస్టుల ఖాళీలను ఆన్లైన్లో చూపించడం లేదు. ఖాళీలు ఆన్లైన్లో చూపిస్తే ఇబ్బందులు వస్తాయని వాటిని బ్లాక్ చేశారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే పోస్టింగ్‌లు వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే చేస్తారని భావిస్తున్నారు. అయితే కొంతమంది ఉన్నతాధికారులు మాత్రం ఇప్పటికిప్పుడు ఆర్డర్లు ఇవ్వాలని కూడా సూచిస్తున్నారు. మరికొన్ని ఉద్యోగ సంఘాలు మాత్రం ఇప్పుడు బదిలీలు కూడా ఉంటాయని, కేటాయింపు ప్రక్రియ తర్వాత పాత స్థానాల్లో ఎలా కొనసాగుతామని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఉద్యోగుల్లో పోస్టింగ్‌లపై సందిగ్ధత నెలకొంది.
ఖాళీగా పోస్టులు
మరోవైపు జిల్లాల్లో చాలా పోస్టులు ఖాళీలున్నాయి. జిల్లాల వారీగా కేడర్ స్ట్రెంత్‌కు, పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు పొంతన కుదరడం లేదు. ఉదాహరణగా ఎక్సైజ్ శాఖలో 49 రాష్ట్రస్థాయి పోస్టులు ఉంటే.. ప్రస్తుతం 29 మంది మాత్రమే ఉన్నారు. వీరిని జోన్ల వారీగా బదిలీ చేస్తున్నారు. కానీ కొత్త జోన్లు, జిల్లాల్లో ఎక్కడ.. ఎలా సర్దుబాటు చేయాలనేది ప్రశ్నార్థకంగానే మారింది. ఎందుకంటే బదిలీలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇంకా వెల్లడించలేదు. కొత్త జిల్లాలు, జోన్ల వారీగా కేటాయించిన వారిని ఏ ప్రామాణికంగా ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలో తేల్చలేదు. సీనియార్టీ ప్రకారం కేటాయింపులు చేసినా.. అదే సీనియార్టీతో పోస్టింగ్‌లు ఇస్తే జూనియర్లకు చాలా అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి.
ఖాళీలు తేలేదప్పుడే..?
వాస్తవానికి ప్రస్తుతం కేటాయింపులు చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తేనే శాఖలు, జిల్లాలు, జోన్ల వారీగా ఖాళీలు తేలుతాయని ఉద్యోగవర్గాలు ముందు నుంచీ చెప్పుతున్నాయి. పోస్టింగ్‌లు తేల్చకుండా ఖాళీలను గుర్తించడం కష్టసాధ్యమే. ఎందుకంటే కొన్ని పదోన్నతుల ఆధారంగా భర్తీ చేయాల్సిన పోస్టులున్నాయి. మొత్తంగా ఖాళీ చూపిస్తున్న పోస్టులను భర్తీ చేస్తే.. ఎక్కడ.. ఎన్నెన్ని ఖాళీలుంటాయనే స్పష్టత వస్తుంది. కానీ ఇప్పుడు కేవలం జోనల్, జిల్లా వారీగా కేటాయింపులు చేస్తే ఖాళీల సంఖ్య తేలదని అటు ఉన్నతాధికారులు కూడా చెప్పుతున్నారు.
36 శాతం ఉద్యోగులకు పోస్టింగ్ల్లేవ్..!
రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో దాదాపు 36 శాతం మంది అధికారులు, ఉద్యోగులకు పోస్టింగ్‌లు లేక పని లేని విధులు నిర్వర్తిస్తున్నారు. ఏండ్ల నుంచి వీరిని బదిలీ చేయడం లేదు. ఒకదశలో తాము చేయాల్సిన పనులను మర్చిపోయేంత వరకు తీసుకువస్తున్నారు. జోనల్ కేటాయింపుల్లో భాగంగా 36 శాతం మంది వరకు ఉద్యోగులు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నట్లు తేలింది. ఆయా శాఖల్లో కీలకస్థానాల్లో ఖాళీలున్నా వారికి విధులు అప్పగించడం లేదు. ఉదాహరణగా ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రాసిన లేఖలో కేవలం అబ్కారీ శాఖలోనే ఖాళీలు ఉన్నా అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. కానీ ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లోనే 36 శాతం మందికి పోస్టింగ్‌లు లేక ఖాళీగా ఉంటున్నారు. వీరి బాధ్యతలను కూడా ఇతర అధికారులకు ఇంచార్జీ కింద అప్పగించారు.
మీరు పాత స్థానాల్లోనే ఉండండి
కాగా సోమవారం ప్రభుత్వ శాఖల తరుపున జిల్లా ట్రెజరీ అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. జిల్లా, జోన్ల వారీగా ఈ ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం కేవలం కేటాయింపులు మాత్రమేనని, ఈ అలాట్మెంట్ ఆర్డర్లు తీసుకుని ఆయా శాఖల హెచ్ఓడీలతో పాటుగా ట్రెజరీల్లో సమర్పించాలని, ఆ తర్వాత మళ్లీ పాత స్థానాలకు వెళ్లి పని చేయాలంటూ సూచించారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఉద్యోగులంతా ఇప్పుడు పని చేస్తున్న స్థానాల్లోనే పని చేయాలంటూ స్పష్టం చేశారు.
- Tags
- Government