అతని కోసం శక్తికి మించి పనిచేశా..

by Shyam |
YS Sharmila
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ రాజకీయాలు, తన రాజకీయ భవిష్యత్‌పై తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్ కోసం తాను శక్తికి మించి పనిచేశానని వెల్లడించారు. ఓ ప్రముఖ న్యూస్‌చానెల్ ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం అనేది వ్యక్తిగత విషయమన్నారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై సీఎం జగన్, ఇతర కుటుంబ సభ్యులు అంగీకరించలేదన్నారు. ఒకరు చెబితే తాను పార్టీ ఏర్పాటు చేయలేదని.. కుటుంబ సభ్యులు వద్దన్నారని అయినా తాను నిర్ణయం మార్చుకోలేదని వెల్లడించారు.

విభేదాలు వస్తే సంబంధం లేదంటారా? సజ్జల వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల

తెలంగాణ రాష్ట్రంలో తాను పార్టీ ఏర్పాటు చేస్తున్న తరుణంలో షర్మిలతో మాకు ఇక సంబంధంలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సాక్షిగా అన్నారని.. ఆ వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయన్నారు. రాజకీయాల్లో తొలి అడుగు వేసిన రోజే సజ్జల రామకృష్ణారెడ్డి ఇక సంబంధం లేదు అనే పదం వాడాడం బాధ కలిగించిందన్నారు. అదే జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం తాను శక్తికి మించి చేసినట్లు గుర్తు చేశారు. రక్త సంబంధం కావడంతో వాళ్లు ఏం అడిగినా కాదనకుండా సాయం చేశానని చెప్పుకొచ్చారు. అలాంటిది సంబంధం లేదు అనే ఒక్కమాటతో తేల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంలో విభేదాలు ఉండటం సహజమని.. అవి కూర్చోబెట్టి చర్చించుకుంటే సమసిపోతాయన్నారు. విభేదాలు ఉంటే సంబంధం లేదని ఎలా అంటారని ప్రశ్నించారు. తాను ప్రజలు వదిలిన బాణాన్ని అని షర్మిల స్పష్టం చేశారు. తన రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో తన తల్లి వైఎస్ విజయమ్మ కొండంత అండగా నిలిచారని.. తన వెన్నంటి ఉండి తనకు మద్దతునిచ్చారని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed