- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
వాలంటీర్ల ఎఫెక్ట్: అంతర్మథనంలో వైసీపీ ఎమ్మెల్యేలు
దిశ, ఏపీ బ్యూరో: 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది. 175 నియోజకవర్గాలకు గానూ 151 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో అత్యధిక శాతం అంతకు ముందు రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు పడినవారే. అయితే కాలం కలిసి రావడంతో వారంతా ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇక ప్రజా సేవలో దూసుకుపోవచ్చని భావించారు. తమ కల నెరవేరడంతో వైసీపీ ఎమ్మెల్యేలు తెగ సంబరపడిపోయారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన మెుదట్లో తెగ ఉత్సాహం చూపించారు. కార్లలో తెగ హల్‌చల్ చేశారు. అంతే ఆరు నెలలు గడిచేసరికి ఉత్సాహం పోయి నిరుత్సాహం వచ్చిందని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
నియోజకవర్గాల్లో తమకు గుర్తింపు లేకుండా పోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలమని, తమ నియోజకవర్గంలో జనాలకూ అక్కరలేదు… అటు జగన్‌కీ పట్టడంలేదని మదనపడుతున్నారుట. ఇది ఎవరో ప్రతిపక్షాలు అన్నమాట కాదు వైసీపీ నిర్వహించిన సర్వేలో తేలిన నిజం అని సమాచారం. ఇటీవలే వైసీపీకి చెందిన కీలక నేత తమ పార్టీలో యాక్టివ్‌గా ఉండే ఎమ్మెల్యేలు ఎవరు, ఎంపీలు ఎవరు అన్న దానిపై సర్వే నిర్వహించారట. అయితే ఆ సర్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసినట్లు ప్రచారం జరుగుతుంది.
ఎంపీలు, ఎమ్మెల్యేలలో మెజారిటీ అసంతృప్తిగా ఉంటున్నారట. తమకు ఏ రకమైన అధికారాలు లేవని, జనాలు కూడా అసలు గుర్తించడం లేదని, తాము చేసేందుకు ఏమీ లేదని అసహనం వ్యక్తం చేశారట. ఏదో శంఖుస్థాపనలకు అలా వచ్చి ప్రజలకు మెుహం చూపించి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నట్లు చెప్పుకొచ్చారట. అటు వైసీపీ అధినాయకత్వం కూడా తమను ఏ మాత్రం పట్టించుకోవడంలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే మామూలు విషయం కాదు. అదికూడా అధికార పార్టీలో ఉంటే ఆ కిక్కే వేరు, ఆ లెక్కే వేరు. కానీ జగన్ హయాంలో ఎమ్మెల్యేలకు ఏ మాత్రం విలువ లేదని వాపోతున్నారట.
అటు జగన్, ఇటు జనం మధ్యలో ఎవరూ లేరు. అలా జగన్ డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోయారు. ఇక వారికి అనుసంధానంగా వాలంటీర్లు ఎటూ ఉన్నారు. దాంతో వైసీపీ ఎమ్మెల్యేల గురించి ప్రజలు సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఒకప్పుడు ఉద్యోగాల దగ్గర నుంచి రేషన్ కార్డు, పింఛన్ వరకు అన్నీ ఎమ్మెల్యే సిఫారసులతోనే జరిగేవి. కానీ నేడు అవన్నీ గ్రామ వాలంటీర్లతోనే చేసేస్తోంది ప్రభుత్వం. ఒక చిన్న పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక విషయంలో గతంలో ఎమ్మెల్యే కార్యకర్తలతో సమావేశాలు పెట్టి తమ హవా నడిపించేవారు. అలాంటిది ఇప్పుడు ఏమీ లేదని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారట.
ఎలాంటి సిఫార్సులకు తావివ్వకుండా పారదర్శకంగా ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నది ప్రభుత్వ లక్ష్యం మంచిదే. వలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అత్యధిక శాతం ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయి. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ తమను కూడా కలుపుకుని వెళ్లాలని వైసీపీ ఎమ్మెల్యేలు సూచిస్తున్నారట. తమను ఎమ్మెల్యేలుగా ప్రజలు గుర్తించడం లేదని కనీసం గుర్తింపు అయినా ఇవ్వాలని వేడుకుంటున్నారట. ఎంపీలు, ఎమ్మెల్యేల అసంతృప్తి తెలియడంతో కరోనా తగ్గిన తర్వాత వైసీపీ నాయకత్వం ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.