TG Ministers: రేషన్ కార్డుల అర్హుల జాబితా ప్రకటించలేదు

by Gantepaka Srikanth |
TG Ministers: రేషన్ కార్డుల అర్హుల జాబితా ప్రకటించలేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటివరకు రేషన్ కార్డుల జారీకి సంబంధించి అర్హులైన జాబితాను ప్రకటించలేదని, రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా పలువురు మంత్రులు స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన గ్రామ సభల్లో గతంలో ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోనివారు కూడా ఇప్పుడు చేసుకోవాలని మంత్రులు సూచించారు. ఈనెల 24 వ తేదీ వరకు జరగనున్న గ్రామ సభల నిర్వహణ, ప్రజల స్పందన, నాలుగు పథకాల కు సంబంధించి జిల్లా కలెక్టర్లతో మంగళవారం సాయంత్రం సచివాలయం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, దనసరి అనసూయ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలు ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు దాదాపు రూ.40 వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని వారు వెల్లడించారు. దాదాపు పదేళ్ల తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నందున ఈ రెండు పథకాలకు అత్యధికంగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, గతంలో దరఖాస్తు చేయని వారు ఈ గ్రామ సభల్లో ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తు దారుల్లో ఇల్లు లేని వారు, ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారి జాబితా గ్రామ సభలలో తెలియచేయాలని, మరెవ్వరైనా దరఖాస్తు చేసుకోక పొతే తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు.

ఇప్పటివరకు రేషన్ కార్డుల జారీకి సంబంధించి అర్హులైన వారి జాబితాను ప్రకటించలేదని, అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన పిదప అర్హులైన వారిని ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. నేడు జరిగిన గ్రామ సభలు విజయవంతంగా జరిగాయని, ఇందుకు జిల్లా కలెక్టర్లను అభినందించారు. ఈ నాలుగు పథకాలకు సంబందించి స్వీకరించే దరఖాస్తులలో తప్పనిసరిగా దరఖాస్తుదారుల పేరు, ఆధార్ కార్డు నెంబర్, చిరునామా, ఇంటి అడ్రస్ తదితర వివరాలను తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. కాగా, నేడు రాష్ట్రంలో 4098 గ్రామాలలో గ్రామసభలను విజయ వంతంగా నిర్వహించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

Next Story