ఆ జిల్లాలో వైఎస్ షర్మిలను ఆదరిస్తారా..?

by Shyam |
ఆ జిల్లాలో వైఎస్ షర్మిలను ఆదరిస్తారా..?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: అడవులు, ఆదివాసీలు ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో వైఎస్సార్ అంటే అభిమానం చూపే జనం ఇప్పటికీ ఉన్నారు. తాజాగా గులాబీ పార్టీదే గుత్తాధిపత్యం కొనసాగుతున్న ఈ జిల్లాలో.. టీఆర్ఎస్‌కు చెందిన 9 మంది సర్పంచ్‌లు, ఒక ఉప సర్పంచ్ షర్మిల పార్టీ పెట్టకముందే ఆమెతో చేరిపోయారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైసీపీ తాజా, మాజీ నేతలు, అభిమానులతో శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా.. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఇక స్థానిక అంశాలే ఎజెండగా చేసుకుని ఆమె మాట్లాడటం అందరిని ఆకట్టుకున్నట్టు సమాచారం.

ఇక షర్మిల ప్రభావం ఆదిలాబాద్ జిల్లాలో ఏ మేరకు ఉంటుందనే చర్చ సాగుతోంది. తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న ఆమెకు.. కేవలం ఆత్మీయ సమావేశానికి నాయకులు భారీగా తరలివెళ్లడం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలను కలవరానికి గురి చేస్తోంది. ఇందులో వైఎస్సార్ అంటే అభిమానంతో వస్తున్న వాళ్లు కొందరుంటే.., ఇతర పార్టీల్లో ఆదరణ దక్కని వారు కూడా ఉన్నారు. ఇది ఇలా ఉంటే అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లు కూడా షర్మిలకు జై కొట్టడం చర్చనీయాంశమైంది.

టీఆర్ఎస్ సర్పంచ్‌లు షర్మిలకు మద్దతు..

ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది సర్పంచ్‌లు, ఒక ఉపసర్పంచ్ షర్మిలకు సంపూర్ణ మద్దతు తెలపడం గమనార్హం. గోవింద్ నాయక్, గంగాధర్ ఆధ్వర్యంలో కేస్లాపూర్ గ్రామ సర్పంచ్ నాగనాథ్, ఉప సర్పంచ్ సాగర్, తేజాపూర్‌కు చెందిన భీంరావ్, శంకర్ గూడ సర్పంచ్ లక్ష్మణ్, ధనోరా సర్పంచ్ జయరాం, పిప్రీ సర్పంచ్ సుదర్శన్, గౌరాపూర్‌ సర్పంచ్ కృష్ణ, ఇచ్చోడకు చెందిన సునీల్ కుమార్, దేవాపూర్‌ సర్పంచ్ జాకేశ్, నిర్మల్‌కు చెందిన రాజేశ్‌లు షర్మిలకు మద్దతు తెలిపారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల్లో అంతర్మథనం మొదలైంది.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి వరకు అధికార పార్టీ నుంచి పెద్దగా వలసలు లేవు. కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వలసలు ఉండగా.. తాజాగా టీఆర్ఎస్ నుంచి వలసలు వెళ్లటం, అదీ షర్మిలకు మద్దతుగా నిలబడటంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. అసలు ఎందుకిలా జరిగిందని.. రానున్న రోజుల్లో పెద్ద తలకాయలు ఏమైనా షర్మిల వెంట నడుస్తారా.. అసలు ఎవరెవరు వెళ్లే వారిలో ఉన్నారో అప్పుడే ఆరా తీయటం ప్రారంభించారు.

అయితే, ఉమ్మడి జిల్లాలో క్రిస్టియన్లు, ముస్లీంలతో పాటు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు షర్మిల పార్టీకి పడతాయనే చర్చ ఉంది. ఇక వైఎస్సార్, జగన్ అభిమానులు పెద్ద ఎత్తున ఉండగా.. వీరంతా షర్మిలకు మద్దతుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్సార్ తనయను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో అన్న అంశం ఉత్కంఠను రేపుతోంది.

Advertisement

Next Story