ర్యాపిడ్ టెస్ట్ కిట్లలో అవినీతి జరగలేదు: జగన్

by srinivas |
ర్యాపిడ్ టెస్ట్ కిట్లలో అవినీతి జరగలేదు: జగన్
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల కోసం ఉత్తర కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను రప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అధిక ధరకు కొనుగోలు చేసి, వాటాలు పంచుకున్నారంటూ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ ర్యాపిడ్ కిట్లు ఎక్కడ దొరికినా కొనుక్కోమని కేంద్రం చెప్పిందని జగన్ వెల్లడించారు. ఐసీఎంఆర్ అనుమతిచ్చిన కంపెనీకే రాష్ట్రం ఆర్డర్ ఇచ్చిందని ఆయన స్ఫష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినప్పుడు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఉత్తర కొరియాలో తయారయ్యాయన్న జగన్, అదే సంస్థకు మన దేశంలో తయారీకి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చాక రేటు తగ్గిందని తెలిపారు. ముందు చూపుతో రాష్ట్రం పెట్టిన షరతుల వల్ల ర్యాపిడ్ టెస్టు కిట్ల రేట్లు కూడా తగ్గబోతున్నాయని, వాటి ధరలు తగ్గించేందుకు తయారీ సంస్థ కూడా ఒప్పుకుందని ఆయన ప్రకటించారు. చాలా నిజాయతీగా ర్యాపిడ్ టెస్టు కిట్లు ఆర్డర్ చేశామని, ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా జాగ్రత్త పడిన ఏపీ వైద్యఆరోగ్య శాఖకు అభినందనలని ఆయన చెప్పారు.

కరోనాను కట్టడి చేసేందుకు ఒక్కో ర్యాపిడ్ టెస్ట్ కిట్‌ను 795 రూపాయలకు కొనుగోలు చేయాలని ఐసీఎంఆర్ ఆర్డర్ ఇచ్చిందని చెప్పిన ఆయన, అది తెలిసి కూడా 65 రూపాయల తక్కువ ధరకు తాము ఆర్డర్ చేశామని ఆయన తెలిపారు. ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు పర్చేజ్ ఆర్డర్‌లో అధికారులు ఓ షరతు పెట్టారని వెల్లడించారు. ఇవే కిట్లను తక్కువ ధరకు ఎవరికైనా అమ్మితే దాని ప్రకారమే చెల్లిస్తామని షరతు మీదే ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొనుగోలు చేశారని ఆయన ప్రకటించారు. కొనుగోలు చేసిన లక్ష కిట్లకు కేవలం 25 శాతం ధర మాత్రమే చెల్లింపులు జరిగాయని ఆయన తెలిపారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలులో అవినీతికి తావులేదని ఆయన స్పష్టం చేశారు. విపక్షాలు లేనిపోని రాద్దాంతం చేస్తున్నాయని ఆయన తెలిపారు.

tags:corona virus, covid-19, rapid test kits, ap, ap cm, jagan

Advertisement

Next Story

Most Viewed