ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మిస్సింగ్.. అసలేం జరుగుతుంది

by Sumithra |
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మిస్సింగ్.. అసలేం జరుగుతుంది
X

దిశ, తిరుమలగిరి : బోయిన్ పల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యం కాగా, వారితో పాటు వెళ్లిన మరో మహిళ కూడా అదృశ్యమైన ఘటన కుటుంబ సభ్యుడి ఫిర్యాదుతో బయటపడింది. బోయినపల్లి ఎస్ఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం అదృశ్యమైన కుటుంబ సభ్యులతో పాటు మరో మహిళ కూడా ఎటు వెళ్లారో తెలుసుకోవడానికి వారు వెళ్లిన దారిలో ఉన్న ప్రతీ సీసీ కెమెరాను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. న్యూ బోయిన్ పల్లి ఏడుగుడుల సమీపంలో మహేష్, ఉమ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నారు. కాగా మహేష్ స్థానిక ఓ నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అయితే సంధ్య అనే మహిళ గురువారం ఉదయం మహేష్ ఇంటికి వెళ్లి మహేశ్ ఉమ దంపతులు తమ పిల్లలు రిషి, చైతు, శివన్ లతో పాటు బయటకు వెళ్లినట్లు గుర్తించామని ఎస్సై తెలిపారు.

సీసీ కెమెరాలే ఆధారంగా మారాయి.

మహేష్ ఆయన భార్య ముగ్గురు పిల్లలతో పాటు మరో మహిళ అదృశ్యమైన సంఘటనను ఛేదించడానికి పోలీసులకు సీసీ కెమెరాలే పూర్తిగా ఆధారమయ్యాయన్నారు. ఐదుగురు కుటుంబ సభ్యులతో పాటు, మరో మహిళ కూడా బయటకు వెళ్లినట్లు ఇంటి యజమాని మహేష్ భార్య ఉమ సోదరుడు బిక్షపతికి చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్సై తెలిపారు. ఒకేసారి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఈ ఆరుగురు ఒక ఆటో బుక్ చేసుకుని బోయిన్ పల్లి నుండి ఇమ్లీబన్ బస్టాండ్ వరకు వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించామని తెలిపారు. ఇమ్లీబన్ బస్టాండ్ వరకు వెళ్లిన ఈ ఆరుగురు అక్కడ నుండి ఎటువైపు వెళ్లారు అనే కోణంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఉమ సోదరుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఐదుగురు కుటుంబ సభ్యులతో పాటు సంధ్య అనే మహిళ కూడా వారితో పాటు ఎందుకు వెళ్లిందని, అసలు ఆమెకు వీరికి ఉన్న సంబంధం ఏమిటి అని సంధ్య కుటుంబ సభ్యులలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరంతా ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు అనే కోణంలో పోలీసులు తమ దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు.

Next Story

Most Viewed