- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయ్ మత్తులో యువత
దిశ, సిరిసిల్ల: ఎంజాయ్ కోసం యువత గంజాయికి అలవాటు పడుతోంది. గతంలో సిగరెట్, మద్యం సేవించడం ఫ్యాషన్‌గా ఫీల్ అయ్యేవాళ్లు. ఇప్పుడు ఆ రెండింటిని దాటి గంజాయికి అడిక్ట్ అవుతున్నారు. ఎక్కువగా ఇంజినీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, మెడిసిన్ విద్యార్థులు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో గుట్టుగా గంజాయి దందా సాగుతోంది.
గంజాయికి అలవాటైన యువకులకు నిత్యం సరఫరా చేసేందుకు కొందరు ముఠాగా ఏర్పడ్డారు. నిషేధిత గంజాయిని అరికట్టాల్సిన పోలీసులు ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో జిల్లాలో చాపకింద నీరులా దందా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. గంజాయి వాడుతున్న వారిలో అత్యధికంగా మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత హీరోయిజంగా ప్రారంభమై చివరకు గంజాయి లేకుంటే పిచ్చెక్కిపోయే స్థాయికి యువకులు చేరుకుంటున్నారు.
అందుబాటులోనే..
ప్రతి ఒక్కరికీ గంజాయి అందుబాటులో ఉండడంతో దీని వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. సిగరెట్‌తో మొదలై.. గంజాయికి అలవాటు పడుతున్నారు. పట్టణ శివారుల్లో నిర్మానుష్య ప్రదేశాలను డెన్‌లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతిరోజు సాయంత్రం, రాత్రి వేళల్లో గంజాయి సేవించడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించి మత్తులో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ పట్టణంలో వేలాది మంది యువకులు నిత్యం గంజాయి సేవిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓసీబీ స్లిప్‌లకు డిమాండ్..
సాధారణ సిగరెట్లలో నింపుకుని ఓసీబీ స్లిప్‌లో గంజాయి పెట్టి కాల్చుతున్నారు. గంజాయిని చేతిలో వేసుకుని నలిపిన తర్వాత దాన్ని ఓసీబీ స్లిప్‌లో చుట్టి సిగరెట్ తరహాలో కాలుస్తారు. మామూలు కాగితం మంట అంటుకుంటే వేగంగా కాలిపోతుంది. ఈ ఓసీబీ స్లిప్ ప్రత్యేకమైన కాగితం కావడంతో గంజాయి నింపినప్పుడు సిగరెట్ తరహాలో ఆరిపోకుండా వెలుగుతాయి.
మత్తులో మైనర్లు..
పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థులను గంజాయి నిషా కమ్మేస్తుంది. గంజాయి ఘాటు వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. పదో తరగతి లోపు విద్యార్థులు గంజాయితో పాటు సిగరెట్, మద్యం, గుట్కా వంటి మత్తు పదార్థాలకు ఆకర్షితులై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మత్తుకు అలవాటు పడిన వారు అడ్డదారిలో డబ్బులు సంపాదనకు దిగుతున్నారు. తల్లిదండ్రులు కొనిచ్చిన ద్విచక్రవాహనాలు, ల్యాప్‌టాప్‌లు, బంగారు ఆభరణాలను సైతం అమ్మి.. గంజాయి కొనుగోలుకు వెచ్చిస్తున్నారు.
చాపకింద నీరులా..
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చాపకింద నీరులా గంజాయి దందా విస్తరిస్తోంది. యువతను టార్గెట్ చేసుకుని పలువురు యథేచ్ఛగా గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. రాజకీయ నాయకుల అవసరాలకు, గంజాయ్ రవాణాకు యువతను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. వేములవాడ, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో గంజాయి దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో కొంత మంది రౌడిషీటర్ల పేర్లు చెప్పుకుంటూ కొత్త బ్యాచ్‌లను తయారు చేసుకుంటున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో కొంత మంది యువత గంజాయి మత్తులో గొడవలకు తెగబడుతున్నారు. రాత్రి 10 దాటితే విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. కొంతమంది యువకులు గంజాయ్‌ని సేవించిన తరువాత అమ్మకాలు కూడా జరుపుతున్నారు. కిలోల చొప్పున కొనుగోలు చేసి 10-15 గ్రాముల ప్యాకెట్లుగా మార్చుతున్నారు. రూ.100-500 వరకు ఒక్కో ప్యాకెట్‌ను విక్రయిస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి జిల్లాకు పెద్ద ఎత్తున గంజాయి దిగుమతి అవుతున్నట్లు సమాచారం.
పట్టించుకోని పోలీసులు..!
నిషేధిత గంజాయి విక్రయాలపై పోలీసులు దృష్టి సారించట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. గంజాయి విక్రయదారులు పట్టుబడిన ఘటనలు అనేకం. కానీ ఎక్కడి నుంచి గంజాయి సరఫరా అవుతుంది..? ఏ విధంగా సరఫరా అవుతుంది..? అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించలేదని తెలుస్తోంది. అసలు సూత్రధారులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమౌతున్నారు. గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతున్నా అడ్డుకట్ట వేయడంలో విఫలం చెందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసులు గంజాయి విక్రయాలను అరికట్టి యువత జీవితాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.