ఏపీని అదానీప్రదేశ్‌గా మార్చేందుకు కుట్ర: పీఏసీ చైర్మన్

by srinivas |   ( Updated:2021-11-06 07:29:17.0  )
ఏపీని అదానీప్రదేశ్‌గా మార్చేందుకు కుట్ర: పీఏసీ చైర్మన్
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదానీప్రదేశ్‌గా మార్చేందుకు కుట్రలు చేస్తుందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 9 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి సెకీతో జగన్ సర్కార్ ఒప్పందం చేసుకోవడం వెనుక ఓ పెద్ద కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. సెకీ సంస్థ టెండర్లను ఎప్పుడూ పిలుస్తూనే ఉంటుందని, అది నిరంతర ప్రక్రియ అని చెప్పుకొచ్చారు.

ఎవరికి కావాలంటే వాళ్లు వెళ్లి టెండర్ వేసుకుంటారు..అయితే యూనిట్‌ సౌర విద్యుత్‌ను రూ.2కే ఇస్తామన్న సంస్థలను వదిలేసి.. రూ.2.49కి టెండర్ వేసిన కంపెనీ నుంచి ఎందుకు కొనుగోలు చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ఒకవేళ రాయితీలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంటే యూనిట్ కరెంట్ ధర రూ.3.40 నుంచి రూ.4 దాకా పెరుగుతుందని ఆయన అన్నారు. తక్కువకు వచ్చే కరెంట్‌ను వదిలేసి.. ఎక్కువ ధర పెట్టి కొనాలనుకోవడం కుంభకోణానికి కారణం కాకపోతే ఇంకేమిటని నిలదీశారు.

వేల కోట్ల రూపాయలను దారి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారని పయ్యావుల ఆరోపించారు. యూనిట్ రూ.2.49 కూడా కాదు.. రూ.3.40 నుంచి రూ.4 అవుతుంది. అప్పుడు కూడా రాష్ట్రంలో ప్లాంట్ పెట్టకుండా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తారా? అని నిలదీశారు. 6 వేల మెగావాట్లను వెంటనే తీసుకోవడానికి రాష్ట్రంలో లైన్లు, భూములు సిద్ధంగా ఉన్నాయని, అలాంటప్పుడు పక్క రాష్ట్రంపై ఆధారపడటం అవసరమా? అని ప్రశ్నించారు. ప్రజాధనం కొల్లగొట్టే హక్కు ఎవరికీ లేదు.

ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం వేస్తారా? సెకీ వద్ద ఉన్న రూ.2 టెండర్లు కొనుగోలు చేయవచ్చు కదా? అని నిలదీశారు. ధర నిర్ణయం ఏపీఈఆర్సీదే అన్నప్పుడు.. తక్కువకు వచ్చే కరెంట్‌ను వదులకుని ఎక్కువ ధర పెట్టి ఎలా కొనుగోలు చేస్తారని ఆయన నిలదీశారు. తప్పులమీద తప్పులు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలియజేయాలని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed