మీడియాకు భయపడిన యశోదా ఆస్పత్రి

by  |
మీడియాకు భయపడిన యశోదా ఆస్పత్రి
X

దిశ, న్యూస్‌బ్యూరో: నిర్ణయించిన ధరలకంటే ఎక్కువ వసూలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం కరోనా చికిత్సకు ఛార్జీలను ఖరారు చేసినా యశోదా ఆసుపత్రికి లెక్కే లేదు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే భయమే లేదు. కానీ ఆసుపత్రిలో జరుగుతున్న దోపిడీ గురించి మీడియాకు తెలియడం, ఆ తర్వాత అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడంతో దిగివచ్చిన ఆసుపత్రి యాజమాన్యం వెనక్కు తగ్గింది. అప్పటివరకూ ఆరు లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేషెంట్‌ను చూడడం సాధ్యం కాదని కుటుంబ సభ్యులకు షరతు పెట్టినా మీడియాకు తెలిసిన తర్వాత డబ్బులేవీ కట్టాల్సిన అవసరం లేదంటూ కోమా స్థితిలో ఉన్న పేషెంట్‌కు మధ్యలోనే చికిత్సను ఆపివేసి బలవంతంగా కుటుంబ సభ్యులకు అప్పగించి అంబులెన్సులో ఇంటికి తరలించే ఏర్పాట్లు చేసింది.

కిడ్నీ చికిత్స కోసం గతనెల 28వ తేదీన యశోదా ఆసుపత్రిలో చేరిన కోరుట్లకు చెందిన రాజశేఖర్ అనే గిరిజన యువకుడు చివరకు కోమా కండిషన్‌లో ఇంటికి చేరుకున్నాడు. కరోనా సోకిందనే పేరుతో డబ్బులు చెల్లించాల్సిందిగా డాక్టర్లు ఒత్తిడి చేశారని పేషెంట్ తల్లి ఆరోపించింది. ఐదురోజుల క్రితం తన కొడుకును చూశానని, ఇప్పుడు ఎలా ఉన్నాడో కూడా తెలియదని, చూడాలని అడిగితే డబ్బులు కడితేనే అంటూ షరతు పెట్టారని, ఇప్పటికే నాలుగు లక్షల రూపాయలు అప్పు చేసి మరీ కట్టానని, ఇంకా ఆరు లక్షల రూపాయలు కట్టాలంటే తానెక్కడికి పోవాలంటూ తన ఆవేదనను మీడియాతో పంచుకుంది.

మీడియా వల్లనే ఆరు లక్షలు కట్టాల్సిన పని లేదంటూ తన కొడుకును డాక్టర్లు డిశ్చార్జి చేశారని, లేదంటే ఏమయ్యేదో తెలియదని పేషెంట్ తల్లి వాపోయింది. ఏ వైద్యం చేస్తున్నారో కూడా తమకు తెలియదని, వార్డు లోపలికే పంపలేదని, ఐదారు రోజులుగా ఎలా ఉన్నాడో తెలియదని, కానీ ఇప్పుడు మాత్రం స్పృహలో లేకుండా శవాన్ని ఇచ్చినట్లుగా బతికున్న మనిషిని అప్పగించారని వాపోయింది.


Next Story