జాబ్ క్యాలెండర్‌పై యనమల ఆసక్తికర వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2021-06-18 06:55:02.0  )
yanamala-Ramakrishna
X

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై మాజీమంత్రి యనమల రామకృష్ణుడు సెటైర్లు వేశారు. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చెబుతున్నవి అంకెల గారడీలేనని ఆరోపించారు. అమరావతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇంటికో ఉద్యోగమని చెప్పి కోటి మంది ఉపాధి పోగొట్టారని మండిపడ్డారు. పారదర్శకత ఉంటే ఫోన్ నెంబర్లు, వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టాలని సవాల్ విసిరారు.

15 రోజుల క్రితం 4.77లక్షల ఉద్యోగాలని చెప్పి.. ఇప్పుడు 6.03 లక్షల ఉద్యోగాలిచ్చామని మాట మారుస్తారా అంటూ నిలదీశారు. 15రోజుల్లోనే 1.25 లక్షల ఉద్యోగాలు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 2.3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే..కేవలం 10 వేల పోస్టులకు జాబ్ క్యాలండర్ ఇచ్చి చేతులు దులుపుకోవడం దురదృష్టకరమన్నారు. ఆర్టీసీలో పనిచేసే 50 వేల మందిని విలీనం చేసి కొత్తగా ఉద్యోగాలిచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. కొవిడ్‌ సమయంలో 3 నెలల కోసం తీసుకున్న 26 వేలమందిని కూడా ఉద్యోగులుగా చూపడం హాస్యాస్పదమని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed