గుడ్‌న్యూస్.. యాదాద్రి ప్రారంభం ఎప్పుడంటే !

by Shyam |
గుడ్‌న్యూస్.. యాదాద్రి ప్రారంభం ఎప్పుడంటే !
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాదాద్రి ఆలయాన్ని రెండు మూడు నెలల్లో ప్రారంభించేందుకు వీలుగా పనులను వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా పరిస్థితుల్లోనూ ఆలయ పనులకు ఆటంకం లేకుండా ప్రభుత్వం నిధులను సమకూరుస్తూ ఉందని, దేశంలోని అనేక ప్రతిష్ఠాత్మక పుణ్యక్షేత్రాల స్థాయిలో యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడంతో పాటు లక్షలాది మంది భక్తులు ప్రవచనాలను వినేందుకు వీలుగా భక్తి ప్రాంగణాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించారు. యాత్రికుల సంఖ్యను తట్టుకునేందుకు వీలుగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా 7ఎకరాల విస్తీర్ణంలో కొత్త బస్టాండును నిర్మించాలని రవాణా మంత్రిని ఆదేశించారు. ప్రగతి భవన్‌లో శనివారం సాయంత్రం యాదాద్రి ఆలయంపై జరిగిన సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం పై ఆదేశాలు జారీ చేశారు.

యాదాద్రి ఆలయ పరిసరాలన్నీ భక్తి శ్లోకాలతో ప్రశాంతత ఫరిడవిల్లేలా అలంకరణలతో తీర్చిదిద్దాలని కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లో రాష్ట్రానికి ఆదాయం తగ్గినా ఆలయ పనులకు మాత్రం నిధులను ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందిస్తోందని, పనుల వేగాన్ని పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆలయ ప్రాంగణంతో పాటు టెంపుల్ టౌన్, కాటేజీల నిర్మాణాలు, బస్టాండ్ తదితరాల పురోగతి గురించి సీఎం చర్చించారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల సుందరీకరణ, లాండ్ స్కేపింగ్ అంశాలు ఎలా వుండాలో వివరించారు. గుట్టమీదికి బస్సులు వెళ్ళే మార్గాల నిర్మాణం, విఐపీ కార్ పార్కింగ్ నిర్మాణం, కళ్యాణ కట్ట, పుష్కరిణీ ఘాట్లు, బ్రహ్మోత్సవ, కళ్యాణ మండపాలు, పోలీస్ అవుట్ పోస్టు, అన్నప్రసాదం కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణం సహా ఆలయ తుదిమెరుగులకు అయోధ్య, అక్షరధామ్ వంటి పుణ్యక్షేత్రాలకు మెరుగులు దిద్దిన అనుభజ్జులైన శిల్పులతోనే పనులు చేయించాలని ఆదేశించారు.

ప్రస్తుత ఆర్టీసీ బస్సు డిపో స్థలాన్ని దేవాలయ నిర్మాణ అవసరాలకోసం వినియోగించుకుంటున్నందున కొత్త ఆర్టీసి బస్టాండు, డిపో నిర్మాణం కోసం ఏడు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. బస్టాండు డిజైన్ విషయంలో ఆలయ నిర్మాణ నియమాలకు అనుగుణంగా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా చూడాలని రవాణా మంత్రికి సీఎం సూచించారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11ఎకరాల స్థలంలో మూడు వేలకు పైగా కార్లుపట్టే విధంగా పార్కింగు ఏర్పాటు చేయాలన్నారు. శాకాహార ఫుడ్ కోర్టుల్లో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, అంతర్జాతీయ కాంటినెంటల్ భక్తులకోసం వంటకాలను అందించాలన్నారు.

చివరి అంకానికి చేరుకున్న ఆలయ నిర్మాణ పనులను ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఉండాలని సీఎం నొక్కిచెప్పారు. ఎక్కడ ఖాళీ జాగ కనిపిస్తే అక్కడ పచ్చదనం శోభిల్లేలా వేప, రావి, సిల్వర్ వోక్ తదితర ఎత్తుగా పెరిగే మొక్కలను నాటాలన్నారు. యాదాద్రికి సమీపంలో ఉన్న గండి చెరువును ఆకర్షణీయమైన లాండ్‌స్కేపింగ్, వాటర్ ఫౌంటెన్లతో తీర్చిదిద్దాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవాలను నిర్వహించుకునేందుకు వీలుగా సుందరీకరణ పనులుండాలన్నారు. యాదాద్రి టెంపుల్ టౌన్‌లో 250డోనార్ కాటేజీలను ప్రత్యేక డిజైన్లతో తీర్చిదిద్ది వాటికి భక్త ప్రహ్లాద సహా అమ్మవార్ల పేర్లను పెట్టుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed