‘నాపై కుట్ర చేసి డోప్ కేసులో ఇరికించారు’

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ రెజ్లర్ (Indian Star Wrestler) నర్సింగ్ యాదవ్ 2016 రియో ఒలింపిక్స్ (Rio Olympics) ముందు నిషేధిక ఉత్ప్రేరకాలు (Doping) వాడాడని తేలడంతో అతడిపై నిషేధం వేటు పడింది. రియో ఒలంపిక్స్ నుంచి తప్పించడంతో పాటు అతడిని రెజ్లింగ్ ఆట నుంచి నాలుగేళ్ల పాటు బహిష్కరించారు. తాజాగా నిషేధం ముగియడంతో తిరిగి శిక్షణ ప్రారంభించిన నర్సింగ్ తనకు అన్యాయం జరిగిందని అంటున్నాడు. తనను కావాలనే డోపీ (Doper)గా నిలబెట్టారని.. ఆహారం, నీళ్ల ద్వారా నా శరీరంలోనికి ఉత్ప్రేరకాలు పంపి ఇరికించారని ఆరోపిస్తున్నాడు.

తన డోపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిగినా ఇంత వరకు దోషులు ఎవరనేది తేల్చలేదని ఆయన అసహనం వ్యక్తం చేశాడు. రెజ్లర్‌పై ఎవరూ కుట్ర చేయలేదని సీబీఐ (CBI) కోర్టుకు నివేదిక సమర్పించింది. దీనిపై నర్సింగ్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికీ ఆ పిటిషన్‌పై కోర్టునుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. నర్సింగ్ కూడా సీబీఐ అధికారులను సంప్రదించినా.. ఇంకా విచారణ కొనసాగుతుందనే చెబుతున్నారు. ‘ఎన్నో క్లిష్టమైన కేసులను ఛేదించిన సీబీఐ.. ఇలాంటి చిన్న కేసులో ఎందుకు జాప్యం చేస్తున్నదో అర్థం కావడం లేదు. తనపై తనకు నమ్మకం ఉంది. తప్పకుండా నిర్థోషిత్వాన్ని నిరూపించుకుంటాను.’ అని నర్సింగ్ పేర్కొన్నాడు. శాయ్ సోనిపట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రానికి నర్సింగ్ యాదవ్ చేరుకున్నాడు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు.

Advertisement