Venezuela President: వెనిజులా ఎన్నికల్లో నికోలస్ మదురో గెలుపు..ఫలితాలపై ప్రతిపక్షం ఆందోళన

by vinod kumar |
Venezuela President: వెనిజులా ఎన్నికల్లో నికోలస్ మదురో గెలుపు..ఫలితాలపై ప్రతిపక్షం ఆందోళన
X

దిశ, నేషనల్ బ్యూరో: వెనిజులాలో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురో గెలుపొందారు. మదురోకు 51.2 శాతం ఓట్లు రాగా.. ప్రతిపక్ష అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు 44.2 శాతం ఓట్లు వచ్చినట్టు నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్ హెడ్ ఎల్విస్ అమోరోసో వెల్లడించారు. 80 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన ఓట్ల ఆధారంగా ఈ ఫలితాలు వెలువడినట్టు తెలిపారు. దీంతో మధురో మరోసారి వెనిజులా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ ఫలితాలపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. దీనిని న్యాయస్థానంలో సవాల్ చేయనున్నట్టు తెలిపాయి. అంతకుముందు వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ గోంజాలెజ్ గెలుస్తాయని వెల్లడించాయి. దీంతో ప్రతిపక్ష నేతలు సంబురాలు చేసుకున్నారు. అయితే ఫలితాలు వెలువడిన వెంటనే విపక్షాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించాయి.

గట్టి పోటీ ఎదుర్కొన్న మదురో

ఈ ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్షం నుంచి మదురోకు గట్టి పోటీ ఎదురైంది. గొంజాలెజ్ నేతృత్వంలోని ప్రతిపక్షం మదురోపై ఎన్నికల్లో పోటీ చేసింది. వెనిజులాలో ఆర్థిక సంక్షోభం కారణంగా దాదాపు 7 మిలియన్ల మంది ఆ దేశాన్ని వదిలి ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరిస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు హామీ ఇచ్చాయి. అయితే గత 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న నికోలస్ మదురోను మాత్రం ఓడించలేకపోవడం గమనార్హం.

ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రిజల్ట్స్: అమెరికా

వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ మధురో ఎన్నికవడంపై అమెరికా స్పందించింది. ఈ ఫలితాలు వెనిజులా ఓటర్ల తీర్పును ప్రతిబింభించలేదని యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. కోస్టా రికన్ ప్రెసిడెంట్ రోడ్రిగో చావ్స్ కూడా అధికారిక ఫలితాలల్లో మోసం జరిగిందని ఆరోపించారు. ఇది సరైన పద్దతి కాదని చెప్పారు. ఈ ఫలితాలను నమ్మకం కష్టంగా ఉందని చిలీ అధ్యక్షుడు తెలిపారు. ఫలితాలపై సంప్రదింపుల కోసం తమ రాయబారిని సంప్రదించినట్టు పెరూ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed