ఇజ్రాయెల్ రాక్షసత్వం : గాజాలో 2 లక్షల మంది ఆకలికేకలు

by Hajipasha |
ఇజ్రాయెల్ రాక్షసత్వం : గాజాలో 2 లక్షల మంది ఆకలికేకలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెల్ మానవ హక్కులను కాలరాస్తోంది. కనీసం ఆహార ట్రక్కులు పాలస్తీనాలోని గాజా ప్రాంతంలోకి వెళ్లకుండా దాదాపు గత రెండు నెలలుగా అడ్డుకుంటోంది. దీంతో గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. అక్కడ నెలకొన్న ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూ‌ఎఫ్‌పీ) ఆందోళన వ్యక్తంచేసింది. గాజా ప్రాంత జనాభాలో 70 శాతం మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. సరిపడా ఆహారం లేక అక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని తెలిపింది. గాజా ఉత్తర ప్రాంతంలోని దాదాపు 2 లక్షల మంది విపత్కర ఆకలితో అలమటిస్తున్నారని పేర్కొంది. ఇప్పటికే యావత్ గాజా ప్రాంతాన్ని వైమానిక దాడులతో ఇజ్రాయెల్ బూడిద కుప్పగా మార్చింది. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతమనే భావనతో ఈజిప్టు బార్డర్‌లో ఉన్న రఫా ఏరియాలో గుడారాలు వేసుకొని వాటిలో తలదాచుకుంటున్నారు. త్వరలోనే రఫా ప్రాంతంపైనా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే గాజాలోని మొత్తం 23 లక్షల జనాభాలో దాదాపు సగం మంది ఆకలి బాధను ఎదుర్కోవాల్సి వస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. గాజా జనాభాలో దాదాపు 6 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని గతేడాది డిసెంబర్‌ నాటికే ఐరాస అంచనా వేసింది. ఇప్పుడు పట్టెడు అన్నం కోసం విలవిలలాడుతున్న వారి సంఖ్య ఇంకా పెరిగిపోయింది. మరోవైపు అమెరికా, జోర్డాన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలు విమానాల ద్వారా గాజాలో ఆహార పొట్లాలను జారవిడుస్తున్నాయి. అయితే అవి గాజా ప్రజలందరి అవసరాలకు సరిపడా ఉండటం లేదు.

Advertisement

Next Story