Bangladesh : బంగ్లాదేశ్‌లో వరదలు.. 20 మంది మృతి.. 52 లక్షల మంది ప్రభావితం

by Hajipasha |
Bangladesh : బంగ్లాదేశ్‌లో వరదలు.. 20 మంది మృతి.. 52 లక్షల మంది ప్రభావితం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎడతెరిపి లేని వర్షాల కారణంగా బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వీటి వల్ల ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 52 లక్షల మంది ప్రజలు ప్రభావితులయ్యారు. చాలా రోడ్లు ధ్వంసం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఫలితంగా పలు మారుమూల ప్రాంతాలకు అత్యవసరంగా ఆహారం, నిత్యావసరాలు, తాగునీరు, మందులు, దుస్తులను కూడా పంపిణీ చేయలేని పరిస్థితి ఏ్పడింది. ఈ తరుణంలో బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్, నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ టెలివిజన్ వేదికగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

వరద బాధితులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఆకస్మిక వరదలు ముంచెత్తకుండా పొరుగుదేశాలతో చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు. భారత్‌కు చెందిన త్రిపుర రాష్ట్రంలో ఉన్న దుంబూర్ డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా తెరవడం వల్లే బంగ్లాదేశ్‌లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద పోటెత్తిందనే తప్పుడు ప్రచారం కూడా జరుగుతోంది. ఇవన్నీ వదంతులేనని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Next Story