ఆస్ట్రియా పర్యటన చాలా ప్రత్యేకమైంది: ప్రధాని మోడీ

by Harish |
ఆస్ట్రియా పర్యటన చాలా ప్రత్యేకమైంది: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ బుధవారం ఆస్ట్రియాలో విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో ఆయన ఆస్ట్రియా చాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో సమావేశం అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యానికి సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్బంగా మోడీ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో, తన ఆస్ట్రియా పర్యటన చాలా ప్రత్యేకమైనదని అన్నారు. అనేక దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఈ అద్భుతమైన దేశాన్ని సందర్శించడం జరిగింది. భారత్-ఆస్ట్రియా మధ్య స్నేహానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయం కూడా ఇదేనని ఎక్స్‌లో రాశారు.

ఆస్ట్రియా చాన్సలర్‌తో మోడీ పలు అంశాలపై చర్చలు జరిపారు. ఆవిష్కరణ, పునరుత్పాదక ఇంధనం, కృత్రిమ మేధస్సు, క్వాంటం టెక్నాలజీ, హైడ్రోజన్, నీరు, వ్యర్థాల నిర్వహణతో సహా వివిధ రంగాలలో కృషి చేయడానికి రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. వాతావరణ మార్పు, ఉగ్రవాదం వంటి ఎదుర్కొంటున్న సవాళ్లపై కూడా ఇరువురు నేతలు తమ ఆలోచనలను పంచుకున్నారు.

ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ఏ రూపంలోనూ ఆమోదయోగ్యం కాదని, ఏ విధంగానూ సమర్థించబడదని ఇరువురు నేతలు కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలో వాతావరణానికి సంబంధించి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బయో ఫ్యూయల్ అలయన్స్ వంటి కార్యక్రమాలలో చేరాలని ఆస్ట్రియాను మోడీ ఆహ్వానించారు. ఆస్ట్రియా చాన్సలర్‌తో భేటీలో ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలోని పరిస్థితులపై కూడా మోడీ చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed