బూట్ల‌పై పాకిస్థానీ పాపుల‌ర్‌ పెయింటింగ్‌! ఆ సంస్కృతిని ఇలా..?!

by Sumithra |
బూట్ల‌పై పాకిస్థానీ పాపుల‌ర్‌ పెయింటింగ్‌! ఆ సంస్కృతిని ఇలా..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 'క‌ళ క‌ళ కోస‌మే' అని కొంద‌రంటే కాదు 'స‌మాజాన్ని ఉద్ధ‌రించేదే క‌ళ‌'ని ఇంకొంద‌రంటారు. ఏదేమైనా ప్ర‌భావితం చేసేంత గొప్ప శ‌క్తి క‌ళ‌కి ఉంది. అదే చ‌రిత్రను ఇంకా బ‌తికిస్తోంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సాంస్కృతిక వార‌స‌త్వ క‌ళ నిక్షిప్త‌మై ఉంటుంది. అలాంటి ఓ అపూర్వ‌మైన క‌ళ పాకిస్థానీ 'ట్ర‌క్ ఆర్ట్'. ద‌క్షిణాన‌ త‌క్కువేమో కానీ వాయువ్య భార‌త‌దేశంలో పాకిస్థానీ లారీల పెయింటింగ్ సొబ‌గులు క‌నిపిస్తాయి. పాకిస్థాన్ సంస్కృతిని ప్ర‌తిబింబించే ఈ పెయింటింగ్‌ను స‌రికొత్త కాన్వ‌స్‌పైన అద్దాడు హైదర్ అలీ అనే ఓ ప్ర‌ముఖ పాకిస్థానీ 'ట్ర‌క్ ఆర్ట్' క‌ళాకారుడు.

పాకిస్తాన్ లారీలపై కనిపించే ఈ 'ట్రక్ ఆర్ట్‌'లో దక్షిణాసియా జంతువులు, ప్రముఖులు, మతపరమైన చిహ్నాలను వర్ణించే కుడ్యచిత్రాలు క‌నిపిస్తాయి. ఎంతో శ్ర‌ద్ధ‌తో, అంత‌కుమించిన ప్యాష‌న్‌తో చేసే ఈ పెయింటింగ్‌ని చూసిన ఓ అమెరిక‌న్ అమ్మాయి త‌న షూస్‌పై ఇలాంటి పెయింటింగ్ చేయ‌మ‌ని అడ‌గ‌టంతో, చేయ‌డం ఇష్టం లేక ఎక్కువ ఖ‌ర్చు అవుతుంద‌ని అన్నాడు. అయితే, అడిగినంత ఇస్తాన‌ని చెప్ప‌డంతో స‌రేన‌ని మొద‌లుపెట్టాడు. ఇక‌, డ‌బ్బులొస్తే ఇబ్బందేముంటుంది..?! అప్ప‌టి నుంచి బూట్ల‌పై 'ట్ర‌క్ ఆర్ట్‌' మొద‌ల‌య్యింది. ప్రతి జత బూట్ల‌పైన‌ నాలుగు రోజుల వరకు శ్రమిస్తాడు అలీ. బెస్పోక్ ప్యాటర్న్‌లు, మోటిఫ్‌లు కావాల‌నుకున్న క్లయింట్‌ల నుండి 400 అమెరిక‌న్ డాల‌ర్లు వసూలు చేస్తాడు. ఇలా మొద‌లై, ఆన్‌లైన్ ఆర్డ‌ర్ల‌తో సూప‌ర్ ఫేమ‌స్ అయ్యాడు. ప్ర‌తి నాలుగు రోజుల‌కు ఒక ఆర్డ‌ర్ చొప్పున బిజినెస్ భేషుగ్గా సాగుతుందిప్పుడు.

ఇంత‌కూ, 42 ఏళ్ల‌ హైదర్ అలీ చిన్న‌వ్య‌క్తేమీ కాదు. 2002లో అమెరికాలోని స్మిత్సోనియన్ మ్యూజియంలో అతని క‌ళ‌ను ప్రదర్శించి అంత‌ర్జాతీయంగా గుర్తింపు పొందాడు. ప్ర‌స్తుతం 'ట్రక్ ఆర్ట్‌'కు అంతర్జాతీయ అంబాసిడ‌ర్‌గా పేరుతెచ్చుకున్నాడు. యునైటెడ్ స్టేట్స్‌లోని బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌లో తన క్రాఫ్ట్‌ను విమానం, VW బీటిల్, ఒక మహిళ శరీరంపైన కూడా వేసి 'వారెవ్వా..!' అనిపించుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed