ఆర్టికల్ 370 రద్దు సమీక్షించనంత వరకు ద్వైపాక్షిక చర్చలు ఉండవు : పాకిస్తాన్

by S Gopi |
ఆర్టికల్ 370 రద్దు సమీక్షించనంత వరకు ద్వైపాక్షిక చర్చలు ఉండవు : పాకిస్తాన్
X

దిశ, వెబ్ డెస్క్ : గోవాలో జరుగుతున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO Summit) సదస్సుకి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో (Bilawal Bhutto) హాజరయ్యారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆయనకు స్వాగతం పలికారు.

సమావేశంలో పాల్గొనేందుకు భారతదేశం వచ్చిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ద్వైపాక్షిక సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 కనుక రద్దు చేసి ఉండకపోతే భారతదేశంతో పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చలు జరిపేదేమోనని, ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని సమీక్షించనంత వరకు ద్వైపాక్షికంగా వ్యవహరించే పరిస్థితి లేదని అన్నారు. శుక్రవారం ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్‭ను కలిసిన అనంతరం మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు, అర్ధవంతమైన చర్చపై పాకిస్తాన్ వైఖరి మారదు” అని అన్నారు. మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆపేయాల్సిందేనని.. భారత్‌ ఈ సదస్సు వేదికగా మరోసారి గట్టిగా చెప్పింది.

మే 4 నుంచి 5 వరకు గోవాలో జరిగిన SCO సమావేశానికి హాజరయ్యేందుకు బిలావల్ భుట్టో జర్దారీ గురువారం భారతదేశానికి వచ్చారు. 2011లో అప్పటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బాని భారత పర్యటనకు వచ్చారు. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్ రావడం ఇదే తొలిసారి. ఇక ఉగ్రవాదానికి పాకిస్తాన్ వ్యతిరేకమని, దాన్ని అంతం చేసేందుకు తమదేశం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. “భారత్ చెప్పినందుకు అని కాదు. మేము ఈ విపత్తును (ఉగ్రవాదం) అంతం చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఉగ్రవాదం వల్ల మిగతా వారికి ఎక్కువ నష్టపోయింది మేమే” అని అన్నారు.




“నేను కూడా ఉగ్రవాద బాధితుడినే. దీని వల్ల పాకిస్తాన్ చాలా నష్టపోయింది. కాబట్టి నేనైనా, పాకిస్తాన్ అయినా ఈ ముప్పును ఎదుర్కోవడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాము. ఉగ్రవాదం ముప్పు నిరంతరం కొనసాగుతోంది. సరిహద్దు తీవ్రవాదంతో సహా ఉగ్రవాదాన్ని ఎవరూ సమర్ధించరు. తీవ్రవాదులకు నిధులను అరికట్టాలి” అని బిలావల్ భుట్టో తెలిపారు. SCO సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ దాదాపుగా ఉగ్రవాదం అంశాన్ని హైలైట్ చేస్తూనే మాట్లాడారు. ఈ సమావేశం అనంతరం ఇంటర్వ్యూ ఇచ్చిన పాక్ విదేశాంగ మంత్రి భుట్టో సైతం దానికి కొనసాగింపుగానే మాట్లాడారు.

అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని నియంత్రిస్తూ, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందజేయడాన్ని ఆపివేస్తే తప్ప పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపబోమన్న భారత్ వైఖరిపై బిలావల్ భుట్టో స్పందిస్తూ ‘‘భారతదేశం ఆందోళనలను మేము అర్థం చేసుకుంటాం. అదే సమయంలో మా ఆందోళనలను కూడా భారత్ అర్థం చేసుకోవాలి. వాటిని కూడా పరిష్కరించాలి’’ అని అన్నారు. కులభూషన్ జాదవ్‭ను భుట్టో ప్రస్తావించారు. ఒక నౌకాదళ కమాండర్, పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాద దాడులు చేస్తూ పాకిస్తాన్‌లో ఏమి చేస్తున్నారో భారతదేశం వివరించాలని అన్న ఆయన అది సీమాంతర ఉగ్రవాదం కిందకు రాదా? అంటూ ప్రశ్నించారు. (కులభూషణ్ జాదవ్ రిటైర్డ్ ఇండియన్ నేవీ అధికారి, అతను ఏప్రిల్ 2017లో గూఢచర్యం మరియు ఉగ్రవాదం ఆరోపణలపై పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించింది)

Advertisement

Next Story